జీబీఎస్ అనే కొత్త వైరస్ బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తిరువళ్లూరు సమీపంలోని తిరువూరు ఎంజీఆర్ నగర్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ కుమారుడైన వైదీశ్వరన్ (9) అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆదిద్రావిడుల సంక్షేమ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. గత నెల 22వ తేదీ ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరగా వైదీశ్వరన్ కాళ్లు కదపలేక ఇబ్బందుల పాలయ్యాడు.
దీంతో ఆ బాలుడిని తన తల్లిదండ్రులు వేపంపట్టు ప్రాంతంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లగా, వైద్యపరీక్షలు చేసి, మందులిచ్చారు. ఇంటికెళ్లిన బాలుడు నడవకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించి నరాలు సక్రమంగా పనిచేయకపోవడంవల్లే బాలుడి రెండు కాళ్లు సచ్చుబడిపోయినట్లు నిర్ధారించారు. వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎగ్మోర్‌లోని ప్రభుత్వ చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశోధించిన వైద్యులు అతనికి జీబీఎస్ అనే కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారించి, ఎమర్జెన్సీ చికిత్సా విభాగంలో చేర్చారు.అయితే చికిత్స ఫలించక వైదీశ్వరన్ శనివారం మృతిచెందాడు. రాష్ట్రంలో జీబీఎస్ వైర్‌సకు సంభవించిన తొలి మరణం నమోదు కావడంతో, ఆరోగ్య శాఖ అధికారులు దానిని నివారించే చర్యలు ముమ్మరం చేశారు. తిరువూర్ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు క్రిమిసంహారక మందులు చల్లిస్తున్నారు. దీనిపై అప్రమత్తంగా వుండాలని, పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు.