రాష్ట్ర పోలీసు ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావటంతో తనను హతమార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ మహిళా ఐపీఎస్ అధికారి కల్పనా నాయక్ డీజీపీ శంకర్‌జివాల్‌కు రాసిన లేఖ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. 2024 జూలై 29న నగరంలో ఉన్న తన కార్యాలయం మంటల్లో దగ్ధమైందని, ఆ ఘటన తనను టార్గెట్‌గా చేసుకుని జరిగిన హత్యాయత్నంగా అనుమానిస్తున్నట్లు ఆ లేఖలో ఆమె ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, జైలువార్డెన్‌లు, అగ్నిమాపక సిబ్బంది ఎంపికలో జరిగిన అవకతవకలను బట్టబయలు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగిందని తెలిపారు.న్యాయస్థానం ఉత్తర్వులను అధిగమించి తాను ఉద్యోగుల ఎంపికను అడ్డుకున్నానని, దాని వలన జరగబోయే అప్రతిష్ట నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడానని, ఆ విషయమే తన ప్రాణాలకు ముప్పు తెచ్చేలా తయారైందని తెలిపారు. తన గత యేడాది జూలై 29న తాను కొద్ది నిమిషాలకు ముందు కార్యాలయానికి వెళ్ళి ఉంటే ప్రాణాలను కోల్పోయేదన్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఆ ప్రమాదం జరిగిన మరుసటి రోజే పోలీసుశాఖ ఉద్యోగాల ఎంపిక తన ఆమోదం లేకుండానే జరిగినట్లు ఆమె ఆరోపించారు.సీనియర్ పోలీసు అధికారి అయిన తన ప్రాణాలకే భద్రత లేనప్పుడు, సాధారణ పోలీసుల పరిస్థితి ఏమిటి? అని ఆమె ప్రశ్నించారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత అంటే 2024 ఆగస్టు 15న డీజీపీ శంకర్‌జివాల్‌కు ఆమె ఆ లేఖ పంపారు. ఆ లేఖ ప్రతులను హోంశాఖ కార్యదర్శి, చెన్నై పోలీసు కమిషనర్‌కు కూడా పంపినట్లు ఆమె తెలిపారు. తనపై జరిగిన హత్యాయత్నంపై విచారణ జరపాలంటూ ఆరునెలల క్రితమే ఆదేశాలున్నప్పటికీ ఆ విచారణకు సంబంధించిన ఫలితాల ఇంకా వెలువడలేదని తెలిపారు.