తమిళనాడు సమీపంలో సముద్రంలో ఉన్న రామేశ్వరం ప్రాంతాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా నిర్మించిన టెక్నికల్ అద్భుతంగా న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జిని అభివర్ణించవచ్చు. త్వరలోనే ఈ బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక వారధిని ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఈ బ్రిడ్జి నిర్మాణంలో వినియోగించారు. 2019లో న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. నాలుగున్నరేళ్లలో నిర్మాణం పూర్తయింది.పాత పంబన్ బ్రిడ్జి కాలం చెల్లిపోవడంతో కొత్తది నిర్మించారు.బ్రిడ్జి సముద్రంలో ఉండడం, కొరోజన్ అధిక స్థాయిలో ఉండడం, గాలి వేగం ఎక్కువగా ఉండడంవంటి సమస్యలు తట్టుకునేలా న్యూ పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో హై స్ట్రెంగ్త్ మెటీరియల్, పెయింట్స్ వినియోగించారు.పాత పంబన్ బ్రిడ్జిపై కేవలం డీజిల్ ఇంజిన్లతో కూడిన రైళ్లు మాత్రమే వెళ్లే వీలుండేది. దాంతో కాలుష్యంతో పాటు, అధిక వ్యయం అయ్యేది. కొత్త పంబన్ బ్రిడ్జిని ఎలక్ట్రిక్ ఇంజిన్లతో కూడిన రైళ్లు వెళ్లేలా తీర్చిదిద్దారు. ఈ బ్రిడ్జిని లండన్ లోని టవర్ బ్రిడ్జి నమూనాను అనుసరించి నిర్మించారు. కొన్ని స్పానిష్ డిజైన్లను కూడా పరిశీలించారు.ఈ బ్రిడ్జి ప్రధాన ప్రత్యేకత ఏంటంటే... ఇది సముద్రంపై నిర్మించిన వంతెన. కాబట్టి... సముద్రంలో షిప్ లు వచ్చినప్పుడు ఇది పైకి వెళుతుంది. దాని కింద నుంచి షిప్ లు వెళ్లిపోతాయి. గతంలో ఉన్న పాత బ్రిడ్జి స్ప్లిట్ విధానంలో ఉండేది. ఏవైనా నౌకలు వచ్చినప్పుడు బ్రిడ్జిని మాన్యువల్ గా ఆపరేట్ చేసేవారు. బ్రిడ్జి రెండుగా విడిపోగానే, ఆ గ్యాప్ లోంచి నౌకలు వెళ్లిపోయేవి. దాంతో 45 నిమిషాల సమయం పట్టేది.ఇప్పుడు కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. ఏదైనా నౌక వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కేవలం ఐదున్నర నిమిషాల్లో పైకి లేస్తుంది. దాని కింద నుంచి ఎలాంటి అంతరాయాలు లేకుండా నౌకలు ప్రయాణిస్తాయి.పాత బ్రిడ్జిపై రైళ్లు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం ప్రయాణించేందుకు వీలయ్యేది కాదు. కానీ కొత్త బ్రిడ్జిని అధికవేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనువుగా నిర్మించారు.పాత పంబన్ బ్రిడ్జి ఉన్నప్పుడు 18 రైళ్లు నడిచేవి. కొత్త బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో డిమాండ్ కు అనుగుణంగా ఎక్కువ రైళ్లు నడిచే అవకాశం ఉంది.
![]() |
![]() |