రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధవీడు మండల సమావేశ మందరింలో ఎంపీడీవో నరసయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంద న్నారు. మండలాల వారిగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించి నట్లు తెలిపారు. ఈ ప్రజాదర్బార్‌లో మండల, నియోజకవర్గ స్థాయి అధికారులందరూ ఒకే చోటుకి వచ్చేలా చేసి ప్రజల సమస్యలపై ఇచ్చే అర్జీలకు పరిష్కారం చూపుతామన్నారు. గతం లో కంభం నుంచి అర్ధవీడు మండలానికి రావాలంటే నరకప్రాయంగా ఉండేదన్నారు. రోడ్ల అంచులన్ని కోతకు గురై అడుగుకు ఒక గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కంభం నుండి అర్ధవీడు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు, వెలగలపాయకు వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.4.50 కోట్లు నిధులు మంజూరు చేయించి నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయ న్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మండల నిధులు రూ.50 లక్షలను వినియో గించుకోవాలన్నారు. ఇతర ఏ పనులకు ఆ నిధులు వినియోగించరాదన్నారు. అర్థవీడు మండలంలో శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా కేంద్రంగా త్వరగా ప్రకటిస్తారన్నారు. పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్దికి చిరునామాగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. జూలైలో తల్లికి వందనం, మహిళలకు 1500, తదితర వాగ్దానాలన్ని నెరవేరుస్తారన్నారు. అనంతరం ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీపీ వెంకటరావు, మాజీ ఎంపీపీ పాలుగుళ్ల పురుషోత్తంరెడ్డి, ఏడీఈ బాలాజీనాయక్, మండల అద్యక్షులు బండి ఆంజనేయులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |