ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆప్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు... కాంగ్రెస్ నేత

national |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 08:26 PM

పంజాబ్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నట్లు అర్థం అవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆప్‌కు చెందిన మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్‌లో ఉన్నారని వివరించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కూడా టచ్‌లో ఉండే అవకాశం ఉందని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే ఆప్ సర్కారు కూలిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2022 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో విజయం సాధించి సర్కారును ఏర్పరుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మొత్తం 32 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో టచ్‌లో ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చెప్పుకొచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని వివరించారు. పంజాబ్ ఆప్ చీఫ్ అమన్ అరోడాకు కూడా ఈ విషయం తెలుసని స్పష్టం చేశారు. ఆమ్ ఎమ్మెల్యేలందరికీ ఇదే చివరి అవకాశం అని అర్థమైందంటూనే.. అందుకే వారు టికెట్ల కోసం కొత్త పార్టీల వైపు చూస్తున్నారన్నారు.


ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అతడిని తొలగిస్తే వెంటనే బీజేపీలో చేరుతారంటూ ప్రతాప్ సింగ్ బజ్వా వ్యాఖ్యానించారు. తన 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ తప్పుడు ప్రకటన చేయలేదని.. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకోవాలన్నారు. అలాగే ఆప్ సర్కారును పడగొట్టే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఏరోజూ లేదని.. గతంలోనే ఈ విషయాన్ని వెల్లడించామన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారును పడగొట్టాలని చూస్తోంది కేవలం బీజేపీనేనని చెప్పుకొచ్చారు.


తాను మనస్ఫూర్తిగా ఆప్ సర్కారు ఐదేళ్లు అధికారంలో ఉండి.. పాలనను అందించాలని కోరుకుంటున్నామని వివరించారు. అప్పుడు ప్రజలకు తాము ఎంత చెత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విషయం అర్థం అవుతుందన్నారు. ఇక్కడితో ఆగకుండా.. పంజాబ్ సర్కారుకు చెందిన వేల కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు తరలిపోయాయన్నారు. దీనిపై అనేక మంది ఆప్ నేతలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని.. ఇది నిజమని పునరుద్ఘాటించారు.


ఇదంతా ఇలా ఉండగా.. దీనిపై స్పందించిన ఆప్ పంజాబ్ రాష్ట్ర చీఫ్, మంత్రి అమన్ అరోడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కూలిపోతుందంటూ కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వానే బీజేపీలో చేరబోతున్నారన్నారు. ఇప్పటికే ఆ విషయం ఖాయమైందని చెప్పుకొచ్చారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa