రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టే తనపై బనాయించిన ఏసీబీ కేసులని మాజీ మంత్రి విడదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యక్తిగత కక్షసాధింపుల్లో భాగంగానే తప్పుడు ఫిర్యాదులు చేసించి ఈ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడే ఎస్పీగా ఉండటం వల్ల తనపై జరుపుతున్న విచారణ అంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే సాగుతోందని ధ్వజమెత్తారు. ఏసీబీ కేసులతో భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని, వాటిని చూసి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఆమె మాట్లాడుతూ..... కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పది నెలలుగా నాపై రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు చివరికి ఒక కట్టుకథను తయారు చేసి ఏసీబీ కేసు నమోదు చేశారు. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని గతంలో ఎక్కడా కలవలేదు, మాట్లాడలేదు. మా మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. ఈ కేసుల నమోదుకు వెనకుండి నడిపించే డైరెక్టర్ మాత్రం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంబంధించిన అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇలా నాపై తప్పుడు కేసులు నమోదయ్యేందుకు కుట్ర చేశారు అని అన్నారు.
![]() |
![]() |