పహల్గామ్‌లో 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న ముగ్గురు ముష్కరులు భారత సైన్యం జులై 27న చేపట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’లో హతమయ్యారు. కానీ ఆపరేషన్ విజయవంతం కావడానికి కేంద్ర హోమ్ శాఖ, శాస్త్రవేత్తలు, భద్రతా దళాలు అనేక నిద్రలేని రాత్రులు శ్రమించారు. ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులేనా? అని నిర్దారించడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సోమవారం రాత్రంతా మేల్కొని.. చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 5 గంటల వరకూ వీడియో కాల్‌ల ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి, వారు వినియోగించిన తుపాకుల్లో బుల్లెట్లు పహల్గామ్ దాడిలో దొరికిన బుల్లెట్‌లతో 100 శాతం సరిపోయిందన్న నివేదికను స్వయంగా స్వీకరించారు. ఇదే విషయాన్ని లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా మంగళవారం అమిత్ షా వెల్లడించారు.
పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌పై చర్చ మొదలుపెట్టడానికి కొద్ది గంటల ముందే శ్రీనగర్ సమీపంలోని లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. భద్రతా దళాలకు లభ్యమైన కమ్యూనికేషన్ ఆధారంగా ఉగ్రవాదులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి దాడి చేశాయి. ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండర్ సులేమాన్ షా సహా ముగ్గురు హతమవ్వగా.. ఘటనా స్థలంలో ఎంఎ9, రెండు ఏకే-47లు, గ్రెనేడ్లు వంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురే పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి బాధ్యులని భద్రతా బలగాలు అనుమానించాయి. కానీ ప్రభుత్వ అధికారిక నిర్ధారణకు ముందుగా సాక్ష్యాలు అవసరమయ్యాయి.
బైసరన్ లోయలో దొరికిన బుల్లెట్లతో సరిపోల్చడానికి లిద్వాస్‌లో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ప్రత్యేక విమానంలో చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. బులెట్ టెస్టింగ్ కోసం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేకంగా మెషీన్‌ను వాయుసేన విమానంలో తెప్పించారు. అక్కడ టెస్ట్-ఫైరింగ్ చేసి, పాత బుల్లెట్లను లిద్వాన్‌లో లభ్యమైన వాటితో మ్యాచ్ చేశారు. ఇందులో 99 శాతం సరిపోయినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే అమిత్ షా కశ్మీర్ చేరుకొని, భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ‘ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లే అవకాశం లేకుండా చూడాలి’ అని స్పష్టం చేశారు. దీంతో అప్పుడు నుంచే ఒక వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేశారు.
ఉగ్రవాదులు తరచుగా ఉపయోగించే 8 కిలోమీటర్ల మార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించి, అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశాయి. ఉగ్రవాదులు చొరబాటుకు ఉపయోగించిన ఓ రహస్య సొరంగాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. ఆ సొరంగాలను నీటితో నింపి వరదలతో ముంచెత్తించారు. దీంతో వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. చివరకు, మూడు నెలల పర్యవేక్షణ, ట్రాకింగ్ తర్వాత, సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా, అఫ్గానీ, జిబ్రాన్ అనే ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులను గుర్తించి, కాల్పుల్లో హతమార్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa