ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని విమర్శలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 23, 2025, 09:51 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ‘ఆర్థిక ఉగ్రవాదం’ నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని లోకేశ్ ఆరోపించారు. "ఏకపక్షంగా పీపీఏలను రద్దు చేయడం, పరిశ్రమలను వేధించడంతో రాష్ట్రంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీన్ని చూసి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ వంటి వారు సైతం ఇది ‘ఎకనామిక్ టెర్రరిజం’ అని వ్యాఖ్యానించారు. అమర్ రాజా వంటి సంస్థను కాలుష్యం పేరుతో వేధించి, పక్క రాష్ట్రానికి తరిమేశారు. దీనివల్ల రాష్ట్రం రూ.10,000 కోట్ల పెట్టుబడితో పాటు, పదివేల ఉద్యోగాలను కోల్పోయింది. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జాకీ వంటి ఎన్నో సంస్థలు ఏపీని వదిలి వెళ్ళిపోయాయి. సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి దేశ పరువు తీశారు" అని లోకేశ్ విమర్శించారు."ఐటీ కంపెనీలకు రూపాయికి ఎందుకు భూములు ఇవ్వాలని జగన్ మాట్లాడుతున్నారు. ప్రిజనరీ, విజనరీకి తేడా ఉంటుంది. ఒక్క టీసీఎస్ విశాఖలో ప్రత్యక్షంగా 25వేల ఉద్యోగాలు కల్పిస్తోంది. దీనివల్ల ఏడాదికి రూ.12 వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు ఎకనమిక్ యాక్టివిటీ జరుగుతుంది. కాగ్నిజెంట్, గూగుల్.. ఇంకో నెల ఆగితే మరో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన. ఆ కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం. అందుకే బాబు గారిని విజనరీ అంటారు" అని లోకేశ్ వివరించారు."డీఎస్సీ అంటే టీడీపీ టీడీపీ అంటేనే డీఎస్సీ 90శాతం ఉపాధ్యాయులు తెలుగుదేశంలో నియమితులైన వారే. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. డీఎస్సీపై 106 కేసులు వేశారు. మేం ఎక్కడా బెదరలేదు. మేం సింగపూర్ వెళితే.. ఏపీలో త్వరలో ప్రభుత్వం మారిపోతోందని, పెట్టుబడులు పెట్టవద్దని వైసీపీ నేతలు ఈ-మెయిల్ పెట్టే పరిస్థితి. గడిచిన నాలుగు నెలల్లో ఏపీ జీఎస్టీ గ్రోత్ రేట్ 20 శాతం. ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయింది. మూమెంటమ్ స్టార్ట్ అయింది. పెట్టుబడులు వస్తున్నాయి. ఎకనామిక్ ఇంజన్ మేం కష్టపడి రివైజ్ చేశాం. 20శాతంతో మేం ఆనందపడటం లేదు. ఇంకా చేయాలి. మా లక్ష్యం 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి. ఇందుకు 15శాతం వృద్ధిరేటు రావాలి. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. జీఎస్టీ గ్రోత్ రేట్ లో తమిళనాడు నెం.1. వారిని చూసి అసూయ పడుతున్నా" అని అన్నారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను తీసుకురావడానికి ఎంత కష్టపడ్డామో లోకేశ్ గుర్తుచేశారు. "ఒక కంపెనీని తీసుకురావాలంటే వారి గడప తొక్కాలి, ఒప్పించాలి. తమిళనాడుతో పోటీపడి కియా మోటార్స్‌ను అనంతపురానికి తీసుకొచ్చాం. కరవు నేలల్లో కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పాం. కియా రాకముందు అనంతపురం తలసరి ఆదాయం రూ.70 వేలు ఉంటే, పరిశ్రమ వచ్చాక అది రూ.2.30 లక్షలకు పెరిగింది. ఒకే ఒక్క పరిశ్రమ ఒక జిల్లా రూపురేఖలను ఎలా మారుస్తుందో చెప్పడానికి కియానే నిదర్శనం. యువగళం పాదయాత్రలో కలిసిన దీప అనే సోదరి, కియా అనుబంధ పరిశ్రమలో పనిచేస్తూ నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నానని చెప్పినప్పుడు కలిగిన ఆనందం మరువలేనిది" అని లోకేశ్ వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ‘పునర్నిర్మాణం’ ప్రారంభించామని లోకేశ్ తెలిపారు. "25 ప్రపంచ స్థాయి పాలసీలను తీసుకొచ్చాం. మాకు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న చంద్రబాబు గారి నాయకత్వం ఉంది. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మంత్రంతో పనిచేస్తున్నాం. ప్రతిపాదన వచ్చిన మూడు రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. గడిచిన 17 నెలల్లోనే రూ.10.4 లక్షల కోట్ల పెట్టుబడులకు 340 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు లైన్‌లో ఉన్నాయి" అని ఆయన స్పష్టం చేశారు.నవంబర్‌లో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నామని, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని లోకేశ్ ప్రకటించారు. "గూగుల్ డేటా సెంటర్ కోసం విశాఖలో నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుని అధికారులను తీసుకెళ్లి భూమి చూపించాను. కేంద్రంతో మాట్లాడి పన్ను రాయితీలు సాధించాం. టాటా గ్రూప్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడమే మా లక్ష్యం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేశ్ సభకు హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa