అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. రాజధాని వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, అట్లాంటా, బోస్టన్, చికాగో, లాస్ ఏంజెలెస్ సహా 50 నగరాల్లో ‘నో కింగ్స్’ పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అలాగే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్‌లలోని అమెరికా రాయబార కార్యాలయాల ఎదుట కూడా పెద్ద ఎత్తున ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. వలసదారుల విషయంలో ట్రంప్ అవలంభిస్తున్న కఠిన వైఖరి, యూనివర్సిటీలకు ఫెడరల్ గ్రాంట్లలో కోత, పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరింపు, రాజకీయ ప్రత్యర్థులు, మీడియా దాడులు సహా అనేక నిర్ణయాలపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.
అమెరికా వ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసనలకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. బారోగ్‌లలో శాంతియుత నిరసనలకు లక్ష మందికిపైగా హాజరైనట్టు న్యూయార్క్ పోలీస్ విభాగం తెలిపింది. అయితే, ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. ఇండివిజిబుల్ కో-ఫౌండర్ లియా గ్రీన్ బర్గ్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు పలు ప్రజా సంఘాలు, ప్రముఖల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాగా, ప్రజా ఆందోళనలను రిపబ్లికన్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వీటిని అమెరికా వ్యతిరేక నిరసనలుగా అభివర్ణించింది. ఇక, నో కింగ్స్ నిరసనలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘నన్ను వాళ్లు రాజు అంటున్నారు.. కానీ నేను రాజును కాదు’ అని ఫాక్స్ బిజినెస్‌తో మాట్లాడుతూ అన్నారు. అధికారానికి దూరంగా ఉన్న డెమొక్రాట్ల ప్రాధాన్యతలను తగ్గించడం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో కిరీటం ధరించి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. తలపై కిరీటం ధరించి, యుద్ధ విమానం నడుపుతూ నిరసనకారులపై బాంబులు వేస్తున్నట్టు ఉన్న తన ఏఐ క్లిప్‌ను ట్రంప్ పోస్ట్ చేశారు.
ఆయన రాజకీయ ప్రచార బృందం సోషల్ మీడియాలో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ రాజు మాదిరిగా తలపై కిరీటం, దుస్తులు ధరించి ఉన్న ఈ ఏఐ వీడియో తెగ వైరల్ అవుతుంది. అలాగే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ట్రంప్ కిరీటం ధరించి ఉండగా, నాన్సీ పెలోసీ సహా ఇతర డెమొక్రాట్లు ఆయన ఎదుట మోకాళ్లపై కూర్చుని ఉన్న మరో వీడియోను షేర్ చేయడం గమనార్హం. కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మూడు నిరసనలు జరగడం గమనార్హం.
శాన్ ఫ్రాన్సిస్కోలో ఓషన్ బీచ్‌లో వందలాది మంది తమ ఒంటిపై ‘నో కింగ్స్’ నినాదాలు రాజుకుని ప్రదర్శన నిర్వహించారు. ‘నేను గుర్తించని అమెరికాలో మనం నివసిస్తున్నట్లు అనిపిస్తుంది’ అని నిరసనకారులలో ఒకరు అన్నారు. సీఐఏలో 20 ఏళ్లు పనిచేసిన మరొక నిరసనకారుడు.. ‘నేను స్వేచ్ఛ కోసం, విదేశాల్లో ఈ రకమైన తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాను. ఇప్పుడు అమెరికాలో ప్రతిచోటా తీవ్రవాదులు ఉన్నారని నేను చూస్తున్నాను, వారు నా అభిప్రాయం ప్రకారం, మనల్ని ఏదో ఒక రకమైన పౌర సంఘర్షణకు నెట్టివేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa