దక్షిణ కొరియాలో జరిగిన ఒక విషాదకర సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇంట్లోకి వచ్చిన ఓ బొద్దింకను చంపే ప్రయత్నంలో.. ఓ యువతి తన అపార్ట్‌మెంట్ భవనానికి నిప్పు పెట్టింది. ఒసాన్ నగరంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పొరుగున ఉన్న ఒక మహిళ దుర్మరణం పాలవగా.. పలువురు గాయపడ్డారు.
20 ఏళ్ల వయసున్న ఓ యువతి ఇంట్లోకి ఓ బొద్దింక వచ్చింది. దాన్ని చూసిన ఆమె ఎలాగైనా చంపాలనుకుంది. అందుకోసం అత్యంత ప్రమాదకరమైన పద్ధతిని ఎంచుకుంది. లైటర్‌తో నిప్పును పుట్టిస్తూ.. త్వరగా మండే ఒక స్ప్రేను కలిపి దానిపై కొట్టేందుకు ప్రయత్నించింది. అది ఎక్కడికి వెళ్తే అక్కడ అలాగే చేసింది. ఈక్రమంలోనే బొద్దింక చావడానికి బదులుగా ఇంటికి నిప్పు అంటుకుంది. కానీ బొద్దింకను చంపడంపై మాత్రమే దృష్టి పెట్టిన యువతికి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో కొద్ది క్షణాల్లోనే నిప్పు ఆమె ఫ్లాట్‌తో పాటు అపార్ట్‌మెంట్ భవనం మొత్తం అంటుకుంది.
ఈ అగ్నిప్రమాదంలో 30 ఏళ్ల వయసున్న ఓ పక్కింటి మహిళ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చైనాకు చెందిన ఆ మహిళ.. తన భర్త, రెండు నెలల పసిబిడ్డతో కలిసి ఐదో అంతస్తులో నివసిస్తున్నారు. మంటలు, దట్టమైన పొగ కారణంగా తప్పించుకునే మార్గాలు మూసుకుపోవడంతో.. ఆ దంపతులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దంపతులు తమ పసిబిడ్డను పక్క బ్లాక్‌లోని పొరుగు వారికి కిటికీలోంచి అందించారు. ఆ తర్వాత ఆమె భర్త కిటికీ నుంచి పక్క భవనానికి దూకి సురక్షితంగా బయటపడగలిగారు. అయితే ఆ మహిళ భర్తను అనుసరించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాల కారణంగా కొన్ని గంటల తర్వాత మరణించింది.
కింద అంతస్తులో వాణిజ్య సముదాయాలు, పైన 30కి పైగా నివాస గృహాలు ఉన్న ఈ భవనంలో అనేక మంది నివాసితులు ఈ ప్రమాదానికి ప్రభావితం అయ్యారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా కనీసం ఎనిమిది మంది పొగ పీల్చి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన యువతిపై పోలీసులు కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని స్థానికులు చెబుతున్నారు.
బొద్దింకలను నిర్మూలించడానికి అత్యంత ప్రమాదకరమైన పద్ధతులను అనుసరించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. 2018లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో తయారుచేసిన అగ్నికీలల పరికరంతో బొద్దింకను చంపబోయి తన వంటగదికి నిప్పు పెట్టాడు. అలాగే 2023లో జపాన్‌కు చెందిన 54 ఏళ్ల ఒక వ్యక్తి.. కుమామోటో నగరంలోని తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చూసి, కోపంతో భారీ మొత్తంలో క్రిమిసంహారక మందు స్ప్రే చేశాడు. దాదాపు నిమిషం తర్వాత అక్కడ పెద్ద పేలుడు సంభవించి.. బాల్కనీ కిటికీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa