ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. భారత ప్రాచీన ఆటలతో నెలకు రూ.2 లక్షల సంపాదన

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 07:01 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేయాలని చాలామంది.. కాలేజీ రోజుల్లో నుంచే కలలు కంటూ ఉంటారు. కానీ తీరా టెక్ ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో ఉండే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక.. రోజుకో కొత్త కోర్సు నేర్చుకోలేక.. 9-5 పని గంటల కారణంగా చాలా మంది విసుగు చెంది.. ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ ఉంటారు. ఇక మరికొందరు తమ లక్ష్యాలు, ఆకాంక్షలను వదిలేసి టెక్ ఉద్యోగం చేస్తూ.. నిరాశతో ఉండేవారు ఎప్పుడో ఓ సారి అందులో నుంచి బయటికి వచ్చేసి.. తమకు ఇష్టమైన రంగాల్లో స్థిరపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేయలేక.. బిజినెస్‌లు చేస్తూ.. నెలకు రూ.లక్షలను ఆర్జిస్తూ ఉంటారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ జంట కూడా టెక్ ఉద్యోగాలను వదిలేసి.. భారత ప్రాచీన ఆటలపై దృష్టిసారించి.. భారీగానే సంపాదిస్తోంది. ఒకవైపు భారత సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూనే.. మరోవైపు.. నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నారు.


బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు తనుశ్రీ ఎస్ఎన్.. శశిశేఖర్ ఎస్ తమ టెక్ ఉద్యోగాలను వదిలిపెట్టి.. భారతదేశపు ప్రాచీన బోర్డు ఆటలను తిరిగి పరిచయం చేసేందుకు ఈ రోల్ ది డైస్ సంస్థను మొదలుపెట్టారు. చేతితో తయారుచేసిన.. పర్యావరణ అనుకూలమైన ఆటల ద్వారా భారతదేశ వారసత్వాన్ని, తరాల అనుబంధాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వినూత్న.. స్థిరమైన వెంచర్ వారికి ఇప్పుడు నెలకు రూ.2 లక్షల వరకు ఆదాయాన్ని ఇస్తోంది.


సాధారణంగా ప్లాస్టిక్‌తో తయారుచేసే ఆధునిక ఆటల ప్రపంచంలో.. రోల్ ది డైస్ సంస్థ మాత్రం పర్యావరణ అనుకూలమైన, సుస్థిరమైన వస్తువులను ఉపయోగించి ఈ బోర్డు ఆటలను తయారు చేస్తోంది. పాత, ప్రస్తుత తరాల మధ్య అనుబంధాన్ని పెంచడం.. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటి తరానికి పరిచయం చేయడమే ఈ రోల్ ది డైస్ సంస్థ లక్ష్యం. ఇక ఈ సంస్థ ప్రధానంగా భారతీయ సంప్రదాయ ఆటలైన పచ్చిస్, చౌకత్ బారా (చెస్ ఆటకు పూర్వ రూపం), పులి-మేక వంటి వాటిని హస్తకళలతో తయారు చేసి అందిస్తోంది. వీరు తయారుచేసే ప్రతి ఆటలో భారతీయ వారసత్వం, నాణ్యత, పర్యావరణ బాధ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.


తమ టెక్నాలజీ నేపథ్యాన్ని వదిలిపెట్టి.. ఈ తనుశ్రీ, శశిశేఖర్ జంట.. స్థిరమైన జీవనశైలి, సాంస్కృతిక పరిరక్షణ అంశాలను తమ వ్యాపారంలో ఉండేలా చూసుకున్నారు. ఇక వారి కృషి, వ్యాపార నైపుణ్యం కారణంగా.. రోల్ ది డైస్ సంస్థ స్థాపించిన కొంత కాలానికే నెలకు రూ.2 లక్షల ఆదాయాన్ని అందుకుంది. ఇక తనుశ్రీ, శశిశేఖర్ లాగానే.. భారతదేశంలో మరికొందరు కూడా ఇలాంటి పర్యావరణ హిత ఆలోచనలతో ముందడుగు వేస్తున్నారు. వీరి వెంచర్‌లకు cKinetics వంటి యాక్సిలరేటర్ సంస్థలు మూలధనం, మెంటర్‌షిప్, వ్యాపార మార్గదర్శకాలను అందించి సహకారం అందిస్తున్నాయి.


స్మార్ట్ జౌల్స్ అనే సంస్థ హాస్పిటల్స్, ఫ్యాక్టరీల్లో విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించి.. అనవసరమైన వినియోగాన్ని 23 శాతం వరకు తగ్గించి.. విద్యుత్ బిల్లులు, కర్బన ఉద్గారాలను తగ్గిస్తోంది.


షెల్లీ సిన్హా స్థాపించిన బ్లూఎన్‌కోర్ గేమ్స్ అనే సంస్థ బయోమ్స్ ఆఫ్ నీలగిరిస్ వంటి బోర్డు ఆటలను తయారుచేసి.. ఈ ఆటల ద్వారా పర్యావరణం, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచుతోంది.


భరత్ రాణావత్ తయారుచేసిన ఎన్‌లాగ్ అనే పరికరం.. విద్యుత్ వినియోగాన్ని 23 శాతం వరకు తగ్గిస్తుంది.


ది బయో కంపెనీ అనేసంస్థ టమాట వ్యర్థాల నుంచి శాకాహార, పర్యావరణ అనుకూల తోలును తయారు చేసి, ఆహార వృథా సమస్యకు పరిష్కారాన్ని చూపుతోంది.


సమర్థవంతమైన వ్యాపార నమూనాలతో పాటు, దీర్ఘ కాలిక పర్యావరణ ప్రభావాన్ని నమ్మే వ్యవస్థాపకులకు పెట్టుబడి పెట్టడంలో 'cKinetics' కీలక పాత్ర పోషిస్తోంది. పాత ఆటలను కొత్త రూపంలో మార్కెట్‌లోకి తెచ్చి.. విజయం సాధించిన 'రోల్ ది డైస్' సంస్థ కథనం, లక్ష్యం ఉంటే టెక్ ప్రపంచం వెలుపల కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa