భద్రతా బలగాల ముమ్మర దాడులు, 'ఆపరేషన్ కగార్' వంటి చర్యల కారణంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు బాట పడుతున్న నేపథ్యంలో, వారు సేకరించిన భారీ మొత్తంలో ఉన్న పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. వందల కోట్ల రూపాయల మేర మావోయిస్టుల ఆర్థిక సామ్రాజ్యంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జరిపిన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిధుల సేకరణకు మావోయిస్టులకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. లొంగిపోయిన అగ్రనేతలు, దళ సభ్యుల విచారణ ద్వారా ఈ రహస్య నిధుల నిల్వల ఆచూకీ తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మావోయిస్టులు తమ వద్ద పోగైన భారీ నగదు నిల్వలను సురక్షితంగా దాచుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో, వందల కోట్ల రూపాయల నగదును బంగారంగా మార్చి అడవుల్లోని డంపుల్లో లేదా రహస్య స్థావరాల్లో నిల్వ చేశారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలా మావోయిస్టుల వద్ద సుమారు రూ.400 కోట్ల నిధులు, 400 కిలోల వరకు బంగారు నిల్వలు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఇంత పెద్ద మొత్తంలో బంగారం చేతులు మారడం వెనుక ఉన్న వ్యక్తులు, విధానాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
బంగారంగా మార్చిన మొత్తంతో పాటు, మావోయిస్టులు పార్టీ నిధులను మళ్లించడానికి డొల్ల కంపెనీలు, సానుభూతిపరుల పేర్ల మీదుగా బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు NIA దర్యాప్తులో తేలింది. కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఈ బినామీ ఖాతాల్లోకి తరలించి, అవసరమైనప్పుడు వాటిని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.కోట్లు మళ్లించిన ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మావోయిస్టులు నిధుల సేకరణకు, మళ్లింపునకు ఉపయోగించిన ఈ ఆర్థిక నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు భద్రతా సంస్థలు కృషి చేస్తున్నాయి.
మావోయిస్టులు లొంగిపోవడానికి గల కారణాలపై పోలీసు ఉన్నతాధికారులు కీలక విశ్లేషణ చేస్తున్నారు. వారి వద్ద ఉన్న ఈ భారీ నిధులు, బంగారు నిల్వలను బట్టి చూస్తే, ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు లొంగిపోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆ నిధులతో మరో ఐదారేళ్లు పార్టీని నడపగల సామర్థ్యం వారికి ఉన్నప్పటికీ, భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్ల తీవ్రతతో ప్రాణభయం పెరిగిపోవడంతోనే వారు లొంగుబాటు బాట పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఆ డబ్బు, బంగారం డంపుల వివరాలను రాబట్టేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు విచారణను వేగవంతం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa