ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు: సెర్గియో గోర్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 08:37 PM

అమెరికాకు భారత్ అంత ముఖ్యమైన దేశం మరొకటి లేదని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇండియాలో నూతన అమెరికా రాయబారిగా నియమితులైన గోర్.. సోమవారం (జనవరి 12) ఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను కలుసుకున్న అద్భుత సందర్భం ఇది అంటూ సెర్గియో గోర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2013లో తాను తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు, సంస్కృతి, తాజ్ మహల్ వంటి కట్టడాలు తనపై చూపిన ప్రభావం మరువలేనని గుర్తుచేసుకున్నారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న అసాధారణ స్నేహాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'అధ్యక్షుడు ట్రంప్ నిన్ననే నాతో మాట్లాడారు. ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రంప్ - మోదీల మధ్య ఉన్నది కేవలం దౌత్య సంబంధం మాత్రమే కాదు, అది అత్యంత నిజాయితీతో కూడిన స్నేహం' అని గోర్ పేర్కొన్నారు. రాబోయే ఒకటి రెండేళ్లలో ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


అమెరికా నేతృత్వంలో ప్రారంభమైన 'ప్యాక్స్ సిలికా' అంతర్జాతీయ కూటమిలో చేరాలని భారత్‌ను గోర్ అధికారికంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఇందులో జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. ఇప్పుడు భారత్‌ను ఆహ్వానించడం ద్వారా ఇరు దేశాల మధ్య సాంకేతిక బంధం మరింత బలపడనుందని చెప్పారు. పాక్స్ సిలికా అనేది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని.. ఇది భవిష్యత్తు సాంకేతికతకు వెన్నెముక లాంటిదన్నారు. కీలకమైన ఖనిజాలు,ఇంధన వనరుల సేకరణ, సెమీకండక్టర్ల ఉత్పత్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి, లాజిస్టిక్స్ వరకు పటిష్టంగా నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఎలక్ట్రానిక్స్, AI మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధిలో భద్రతను లక్ష్యంగా పెట్టుకుని ఈ వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.


ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాల చర్చలపైనా స్పందించారు. భారత్ వంటి ముఖ్యమైన దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం సవాలుతో కూడుకున్నదే అయినా.. తాము దానిని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య దౌత్యం పరస్పర సహకారం ప్రాతిపదికన సాగుతుందని సమాన గౌరవం, పారదర్శకమైన వాణిజ్యం, ఉమ్మడి భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇక ఢిల్లీలోని ఇండియా గేట్‌ను చూసినప్పుడు తనకు పారిస్‌లోని 'ఆర్క్ డి ట్రయంఫ్' గుర్తుకు వచ్చిందని.. అయితే ఇండియా గేట్ అందం దాన్ని మించిపోయిందని ఆయన కొనియాడారు. భారత ప్రజల పోరాట పటిమ, వారి ఆధ్యాత్మికత, ఆవిష్కరణల పట్ల తనకెంతో గౌరవం ఉందన్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించగల అత్యంత ప్రభావవంతమైన భాగస్వామ్యం భారత్-అమెరికాలదేనని ఆ దిశగా తాము కలిసి అడుగులు వేస్తామని సెర్గియో గోర్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa