ఏయూ ప్రాంగణం: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినం జూబ్లీహాలులో ఈ ఫలితాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన పరీక్ష ఫలితాల సీడీని ఆవిష్కరించారు. ఈ ఫలితాల్లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు మంత్రి గంటా తెలిపారు. జూన్ నెలలో నిర్వహించిన ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 46,605 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అయితే వారిలో 33,261 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ ఫలితాల్లో 94.38 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 60.17 శాతంతో కృష్ణా జిల్లా ఆఖరు స్థానంలో నిలిచిందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ, డీఈవో నాగమణి, ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa