సినిమా టెక్కెట్ల వ్యవహారం చినికి చినికి గాలివానాల మారుతోంది. సామాన్యులకు వినోదం మరింత దగ్గర చేయాలని టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి థియేటర్లు మూత పడుతున్నాయి. కోట్లు కొద్దీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాలు ప్రభుత్వ నిర్దేశించిన టిక్కెట్ల ధరలు సినిమాలు ప్రదర్శిస్తే కచ్చితంగా నష్టాలు రావడం ఖాయం. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా అయినా సరే 50 రోజులు ఆడితే ఓ చరిత్రలా మారిపోయింది. ఎన్ని కోట్లయినా వారం రోజుల్లోనే రాబట్టుకోవాలి. లేదంటే నష్టాలు తప్పవు. ఇక భారీ బడ్జెట్‌తో తీయాలా? లేదా లో బడ్జెట్ సినిమాలు తీయాలన్నా అన్నది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. అయితే వినోదం దగ్గర చేయాలనుకోవడం తప్పు కాదు గానీ..ప్రభుత్వం నిర్ణయం థియేటర్లు మూసివేతకు కారణమవుతున్నాయి.
సినీ పరిశ్రమ ఎప్పుడూ ఆ నలుగురు పెద్ద హీరోలు...మరో నలుగురు నిర్మాతల మధ్య నడుస్తోంది. వారు ఎంత చెబితే అంత. వీరిలో చాలా మందికి పెద్ద పెద్ద థియేటర్లూ ఉన్నాయి. ఇది వేరే విషయం. పండగల సీజన్ ను దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలతో రూపుదిద్దుకుంటున్న సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రాజమౌలి ఆర్ ఆర్ ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్ ప్రముఖంగా ఉన్నాయి. ఇవి రెండూ పాన్ ఇండియా మూవీలే. పైగా కోట్లు గుమ్మరించారు. ప్రభుత్వం నిర్దేశించిన టిక్కెట్ల ప్రకారం సినిమాలు ప్రదర్శిస్తే ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ దాటాలంటే కనీసం ఏడాది పాటు ఆడాలి. ఇది ఈ రోజుల్లో అసాధ్యం. ఈ ధరలు పెంపు విషయంలో మరో కొన్ని అంశాలు ఇప్పడు తెరపైకి వస్తున్నాయి.
మద్యం ధరలు కూడా ...
సినిమా చూసే వాడికి ధరలు తగ్గించారు. మరి మద్యం ధరలు విషయం ఏంటి. ధరలు తగ్గించమని కాదు... ఊరుపేరు లేని, నాణ్యత లేని బ్రాండ్లకు ధరలు చావగొడుతున్నారని మందుబాబులు వాపోతున్నారు. మా సంగతేంటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా మందుబాబులను వీధుల్లోకి లాగిన ప్రభుత్వం కూలీలు, సామాన్యుల నుంచి మందు రూపంలో భారీగానే వసూలు చేస్తోంది. ఏమంటే మందు ధరలు పెంచితే వాటికి దూరమవుతారని వాదిస్తోంది. అయితే వాస్తవానికి మద్యం తాగే వాళ్లు సంఖ్య ఇంకా పెరిగింది. ఆ శాఖకు వస్తున్న ఆదాయం చూస్తే గతంలో ఎన్నడూ రాని విధంగా ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం అంచనా తప్పినట్టే. నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే మద్య నిషేధం అమలు చేస్తే బాగుండేది.
ప్రైవేటు ట్రావెల్స్ సంగతేంటి
ప్రైవేటు వాహనాలు టూర్స్ అండ్ ట్రావెట్స్ వాహనాలకు కూడా ప్రభుత్వం ధరలు నిర్థేశించాలని పలువురు కోరుతున్నారు. ఒక్క సినిమా టిక్కెట్లు ధరలు తగ్గిస్తే సరిపోదంటున్నారు. పండల సీజన్‌లో ప్రైవేటు వాహనాలు దోచుకుంటున్నాయి. రూ.500 ఉండాల్సిన టిక్కెట్టు పండగ సీజన్‌లో రూ.2000 పైగా వసూలు చేస్తున్నారు. ఇష్టం ఉంటే ప్రయాణించండి లేదంటే మానేయండి అంటున్నారు. సీఎం జగన్ గారూ దీనిపై కూడా దృష్టి పెట్టి...ప్రయాణం మరింత సులభతరం చేయండని పలువురు కోరుతున్నారు.
విద్య వ్యవస్థలో
ప్రభుత్వం విద్యకు ప్రధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుగా ధీటుగా ఉన్నాయి. సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది అభినందించదగ్గ విషయమే. మరి ప్రైవేటు పాఠశాలలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా స్కూల్ ఫీజులు వసూలు చేయడం లేదు. సినిమా వాళ్లు చెబుతున్నట్టే పాఠశాలల్లో మౌలిక వసతులకు భారీ బడ్జెట్ పెట్టామని, ఫీజుల రూపంలో వసూలు చేయకపోతే నష్టమేనని ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అంటున్నాయి.
జిల్లా కలెక్టర్ మల్లకార్జున విశాఖలో థియేటర్లను పరిశీలించారు. నిబంధనలు పాటించని థియేటర్లకు నోటీసులూ అందజేశారు. విద్యాశాఖ అధికారులు ఏ నాడూ ఇంత సీరియస్‌గా పాఠశాలలను తనిఖీ చేయలేదు. గత డీఈవో లింగేశ్వరరెడ్డి అయితే కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండేవారు కాదు. పత్రికల్లో వార్తలు రాగానే వెంటనే ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని, అంతే మళ్లీ షరా మామూలే. థియేటర్ల విషయంలో సీరియస్‌గా ఉన్న ప్రభుత్వ అధికారులు స్కూల్స్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తుండడం, తల్లిదండ్రులు ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విశేషం.
ఆస్పత్రులకూ కనీస ఫీజులు ఉండేలా చేయాలి
జలుబు చేసిందని ఆస్పత్రికి వెళితే కిడ్నీ టెస్టులు కూడా చేసేస్తున్నారు. వేలకు వేలు టెస్ట్‌లు పేరిట వైద్య వ్యాపారం సాగుతోంది. చివరికి పారాసెట్మాల్ ట్యాబెట్లు ఇచ్చి మీకేం లేదని ధైర్యం చెప్పి డిశ్చార్జ్ చేస్తున్నారు. అసలు రోగం ఏమీ లేదని రోగికి తెలిసినా వైద్యుడు దేవుడు...అతని చెబితే శాటిస్‌ఫ్యాక్షన్. అందుకే వేలకు వేలు ధారపోస్తున్నాడు సామాన్య రోగి.
అన్నింటికి ప్రభుత్వం ధరలు నిర్దేశించాలని సామాన్యులు సీఎం జగన్‌ను కోరుతున్నారు. నిత్యావసర వస్తువులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa