ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రమేణ పెట్టుబడుల రాక ఊపందుకొంటోంది. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థ శ్రీసిటీని సందర్శించింది. ఢిల్లీలోని పాపువా న్యూ గినీ దేశ హైకమిషనర్ పౌలియాస్ కోర్ని ఆ దేశానికి చెందిన కొందరు పెట్టుబడిదారులతో కలిసి బుధవారం శ్రీసిటీని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శివశంకర్ ఆయనకు సాదర స్వాగతం పలకగా, శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ శ్రీసిటీ మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి, ఇక్కడ వ్యాపార అనుకూలతలు, పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలు గురించి వివరించారు. శ్రీసిటీ మౌలిక వసతులు, వ్యాపారానుకూల వాతావరణం అద్భుతంగా ఉందంటూ పౌలియాస్ కోర్ని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అడవులు ఎక్కువుగా ఉన్న దేశం నుంచి వచ్చిన తననే, శ్రీసిటీ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుందని చెబుతూ, శ్రీసిటీని 'గ్రీన్ సిటీ' గా తీర్చిదిద్దిన యాజమాన్య కృషిని అభినందించారు. ఈ పర్యటనపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, తమ సుస్థిర అభివృద్ధి ప్రయత్నాల్లో భాగమైన హరిత హిత చర్యలు పౌలియాస్ కోర్ని ప్రశంసలు పొందడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. ఈ రకమైన పర్యటనలు, పరస్పర చర్చలు ఇరు దేశాల వ్యాపార సంబంధాలను మరింత మెరుగు పరుస్తాయని తెలిపారు. ఆయన పర్యటన, పరిశీలనలు, ప్రోత్సాహం ఫలితంగా పాపువా న్యూ గినీ నుండి వ్యాపార పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీసిటీ గురించి విపులంగా తెలుసుకోవడంతో పాటు ఇక్కడ పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేకించి కాఫీ పరిశ్రమపై వ్యాపార అంచనా లక్ష్యంగా పౌలియాస్ కోర్ని పర్యటన సాగింది. ఈ మేరకు శ్రీసిటీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా పలు అంశాలను ఆయన ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa