ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండుగ వేళ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 09, 2022, 09:31 AM

సంక్రాంతి అంటే కోడి పందేలు.. కాలుదువ్వే పుంజులు.. కరెన్సీ కట్టలతో కాయ్‌రాజా కాయ్‌ అంటూ సందడి చేసే పందెం రాయుళ్లు. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు భారీగా జరుగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి సందడి అందరికంటే ముందే మొదలయ్యేది తూర్పు గోదావరి జిల్లాలోనే. అదీ కోనసీమలో అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే ఈసారి పండక్కి కోడిపందే లకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఇవే ఆంక్షలు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులను టెన్షన్ పెడుతున్నాయి. ఇక‌ ఎన్ని ఆంక్షలున్నా పందేలు జరగాల్సిందేని అధికార వైసీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. పోలీసుల ఆదేశాలతో పందేలు జరగకపోతే అధికార పార్టీ పరువుపోతుందని ఇప్పటికే అనేకచోట్ల ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు.


సంక్రాంతి సమయంలో కీలకమైన పందేలు జరగకపోతే నియోజకవర్గంలో తలెత్తుకోలేమని, ప్రతిపక్ష పార్టీలు హేళన చేస్తాయని ఎమ్మెల్యేల వద్ద మొర పెడుతున్నారు. దీంతో క్యాడర్‌ అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే తమ పరపతి పోతుందనే భయం ఎమ్మెల్యేలను వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో పండగ మూడు రోజులు పందేలు ఆడుకోవడానికి ఇబ్బంది రాదని, అంతా తాము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.


ఈనెల 4న కలెక్టర్‌ ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, మండలాల్లో తహశీల్దార్లు, ఎండీవోలతో సమీక్ష జరిపి కోడిపందేలపై నిషేధం ఉందని, ఇవి జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈనెల 7 నుంచి 24 వరకు 144 సెక్షన్‌ అమలుకు వీలుగా ఉత్తర్వులు జారీచేశారు. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందాలు నిఘా పెట్టి ఫోటోలు కూడా తీయించాలని సూచించారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, దండోరాలు వేయించాలన్నారు. అటు ఎక్కడికక్కడ పందేలకు బదులు సంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాలంటూ ఎస్పీ స్వయంగా వీటిని ఆడి స్తున్నారు. ఈనేపథ్యంలో కోడి పందేలు ఉంటాయా? ఉండవా? అనే సందేహాలు నెలకొన్నాయి.


కలెక్టర్‌, ఎస్పీ ఎన్నిచెప్పినా పందేలు ఆడితీరాల్సిందేనని పందెం రాయుళ్లు పంతం పట్టారు. ఆంక్షలను కాదని ఎక్కడికక్కడ కొబ్బరి తోటల్లో రహస్య బరులు సిద్ధం చేస్తున్నారు. ముమ్మిడివరం, అల్లవరం, కాట్రేనికోన, రావులపాలెం, ఉప్పలగుప్తం, రాజోలు, మలికిపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, ఏలేశ్వరం తదితర మండలాల్లో రహస్యంగా బరులు తయారవుతున్నాయి. ఇటీవల కొన్నిచోట్ల పోలీసులు బరులను దున్నించినా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. మరోపక్క దీంతో పందేలకు కోళ్లు, బరులు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి గతేడాది సైతం జిల్లాలో కోడి పందేలకు అసలే మాత్రం అనుమతి లేదని పోలీసులు ముందునుంచీ విస్తృత ప్రచారం చేశారు.


తీరా పండగ దగ్గరపడ్డాక మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో చూసీచూడనట్టు వదిలేశారు. ఇందుకోసం కోనసీమలో డివిజన్‌ స్థాయి నుంచి స్టేషన్‌ వరకు లక్షల్లో మామూళ్లు చేతులు మారాయి. పైకి కలెక్టర్‌, పోలీసుబాస్‌ ఎన్ని చెప్పినా కిందిస్థాయిలో అధికార పార్టీ నేతలను కాదని వారికి వ్యతిరేకంగా వెళ్లడానికి తహశీల్దార్లు, ఎస్‌ఐలు సాహసించలేని పరిస్థితి. అటు కలెక్టర్‌, ఎస్పీ వద్ద మాట రాకుండా, ఇటు ప్రజాప్రతినిధుల వద్ద చెడ్డరాకుండా పండగ మూడు రోజులు కావలసింది తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరించడం షరామామూలుగా వస్తోంది.


అయితే ఈసారి కూడా నిషేధాజ్ఞలు అంటూ ఎంత ప్రచారం చేసినా ఇబ్బందులు ఉండవనే ధీమా నేతలు, పందేరాయుళ్లలో నెలకొంది. అటు స్థానిక ఎమ్మెల్యేలు అంతా చూసుకుంటారనే ధీమాతో ఇప్పటికే పలువురు నేతల అనుచరులు నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తాలను లాగేశారు. పలుచోట్ల కీలక నేతలకు పందేలు, గుండాటకు సంబంధించి అప్పుడే అడ్వాన్సులు కూడా ముట్టాయి. దీంతో యథావిధిగా పందేలు జరుగుతాయనే ధీమాతో అనేకచోట్ల బరులు ముస్తాబవుతున్నాయి. అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం తదితర మండలాల్లో ఇప్పటికే కొబ్బరితోటలను రంగులతో ముస్తాబు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa