ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురంలో జోరు పెంచిన టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 13, 2022, 11:55 AM

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు కావచ్చింది. అయితే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వైసీపీ విఫలమైందన్న ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. గతంలో అడపాదడపా కార్యక్రమాలు చేసిన టీడీపీ నేతలు ప్రస్తుతం వివిధ సమస్యలపై పోరాట జోరు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లోకి అధికారపార్టీ ఆగడాలను తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో పలు పోరాటాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మండలాల వారిగా ఆయా నియోజకవర్గ ఇన్చార్జీల నాయకత్వంలో గౌరసభలు నిర్వహించారు. మరో వైపు పెంచిన ధరలకు నిరసనగా ధర్నాలు,రాస్తారోకో, ఇతర కార్యక్రమాలను చేపట్టారు.


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలం వరకు టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మండలాల్లో చేపట్టిన గౌరసభలకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో నాయకులు ఉత్సాహంగా సభలను నిర్వహిస్తున్నారు. మరో వైపు పెరిగిన డీజిల్, పెట్రోల్,నిత్యావసర ధరలను తగ్గించాలంటూ జిల్లావ్యాప్తంగా ఈ మధ్య నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో రాయదుర్గం నియోజక వర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు , నల్లమాడలో పల్లెరఘునాథరెడ్డి , రాప్తాడులో పరిటాల సునీత , ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నిరసన కార్యక్ర మాలను చేపట్టారు. నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అన్నిచోట్ల ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


 


పెనుకొండలో బికె పార్థసారథి నేతృత్వంలో గ్యాస్ సిలిండర్, మెడలో కూరగాయలు వేసుకొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కళ్యాణదుర్గంలో మారుతీ చౌదరి, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. శింగనమల నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డి, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్, మడకశిరలో ఈరన్న, గుండమల తిప్పేస్వామి, గుంతకల్లులో జితేంద్రగౌడ్, ఉరవకొండలో స్థానిక నాయకులు పాల్గొని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలపై వివిధ రకాలైన ధరల పెంపుతో ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే పనిలో ఉందని ఆరోపించారు.


ధరల పెరుగుదల కారణంగా సామాన్యులు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. పక్క ఉన్న కర్నాటకలో డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం దాని గురించి మాట్లాడటం లేదన్నారు. విద్యుత్ చార్జీలు, ఇతర అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. కుడిచేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో ఇచ్చినదానికన్నా.. అధికంగా లాక్కుంటున్నారని నేతలు విమర్శించారు. ఇసుక, సిమెంట్, ఇనుము, ఇటుకలు, రాళ్లు, ఆఖరికి మట్టిని సైతం సామాన్యులు తోలుకునే పరిస్థితి లేదన్నారు. ధరల పెరుగుదల వల్ల అభివృద్ది మొత్తం ఆగిపోయిందని వక్తలు ఆయా సభల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని వినతి పత్రాలను సమర్పించారు.


ప్రభుత్వం ఇస్తున్న సాయం కథ ఎలా ఉన్నా తమ చేతుల నుంచి చమురు ఇడుగుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్న విషయాలను ప్రస్తావించారు. టీడీపీ నేతల నిరసనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో చోట మోట నాయకుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. తదుపరి ఎన్నికలలో తామే(టిడిపి) అధికారంలోకివస్తామని ధీమా వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa