ఆయుధాలతో విరుచుకుపడుతున్న రష్యాకు ఉక్రెయిన్ ప్రజలు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. తమ దేశంపై దండెత్తి వచ్చిన రష్యా బలగాలను ఓ వైపు ఉక్రెయిన్ సైనికులు ఎదురొడ్డి నిలువరిస్తుంటే.. ఉక్రెయిన్ పౌరులు కూడా తమదైన రీతిలో రష్యా దళాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మొన్నటికి మొన్న సింగిల్‌గానే రోడ్డుపైకి వచ్చి రష్యా యుద్ధ ట్యాంకును ఓ ఉక్రెయిన్ పౌరుడు నిలిపేస్తే.. నిన్నటికి నిన్నె ఉక్రెయిన్ రైతు రష్యా యుద్ధ ట్యాంకును ఏకంగా తన ట్రాక్టర్‌కు తగిలించుకుని తీసుకెళ్లే యత్నం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా బుధవారం నాడు వెలుగులోకి వచ్చిన వీడియో వాటి కంటే మరింత వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో ఉక్రెయిన్ దళాలను మట్టి కరిపించేందుకు రష్యా బలగాలు రోడ్డుపై పాతిన మందుపాతరను ఓ ఉక్రెయిన్ పౌరుడు ఎంతమాత్రం భయం లేకుండా ఒట్టి చేతులతో ఇలా తీసి అలా అల్లంత దూరం నడిచి వెళ్లి పారేశాడు. ఈ సందర్భంగా అతడు నింపాదిగా సిగరెట్ తాగుతూ నడిచిన వైనం ఆకట్టుకుంటోంది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని బెర్డయాన్‌స్క్‌లో కనిపించింది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కసితో సాగుతున్న రష్యా బలగాలు... ఉక్రెయిన్‌లోని బెర్డయాన్‌స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్ పౌరుడు ఆ ల్యాండ్‌మైన్‌ను చూశాడు. అయితే, దాని గురించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వకుండానే అనుకున్నదే తడవుగా రోడ్డు మీద ఉన్న ఆ ల్యాండ్‌మైన్‌కు రెండు ఎలాంటి రక్షణ పరికరాల సాయం లేకుండానే ఒట్టి చేతులతో పట్టుకొని దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. ల్యాండ్‌మైన్‌ను తీసుకువెళ్తున్న సమయంలో బాంబు పట్టుకున్నాననే టెన్షన్ లేకుండా అతను సిగరెట్ తాగుతూ ఓ హీరోలా దాన్ని పట్టుకుని నడిచిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa