విజయనగరంలో జరిగిన ఓ ఘటన సంచలనం రేపుతుంది. ఈ ఏడాది జనవరి 10న అర్ధరాత్రి దాటిన తర్వాత తెర్లాం మండలంలోని రాజయ్య పేటలోమూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ(67) సజీవ దహనమైంది.ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఆవిషయం మర్చిపోయారు.
సరిగా రెండు నెలలకు.. గౌరమ్మ ప్రమాదవశాత్తు కాలిపోలేదని, తానే హత్య చేసి చంపేశానంటూ అదే గ్రామానికి చెందిన ఆర్.సింహాచలం అనే యువకుడు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి బొబ్బిలి సీఐ శోభన్ బాబు, ఎస్ సురేంద్రనాయుడు విచారించారు. ఈ సమయంలోసింహాచలం చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
'నాలుగేళ్ల క్రితం నా భార్య, పిల్లలకు గౌరమ్మ చిల్లంగి పెట్టడంతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో భార్యపిల్లలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. గత ఏడాది దసరాకు ముందు నా తండ్రికి చిల్లంగి పెట్టడంతో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గౌరమ్మను ఎలాగైనా చంపాలనుకున్నా.. పగలే హత్య చేసి పోలీసులకులొంగిపోవాలి అనుకున్నా. జనవరి 10న ఓ ఇంటి నుంచి గొడ్డలి. పెట్రోల్ తీసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాతగౌరమ్మ ఇంటికి వెళ్లా. నిద్రిస్తున్న ఆమె మెడపై గొడ్డలి తిరగేసి రెండు సార్లు బలంగా కొట్టాను. ఇంకా బతికేఉందేమోనన్న అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించాను. చిల్లంగి పెట్టిందని తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదని నిందితుడు తెలిపాడు.
ఎందుకు లొంగిపోయాడంటే..?
ఈనెల 13న అర్థరాత్రి గ్రామంలోని పాతినవలస కనకరాజుకు చెందిన పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో సింహాచలం అటుగా వెళ్లడం గమనించి బాధితులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీశారు. పశువులశాలను తాను కాల్చలేదని, గౌరమ్మను కాల్చానని చెప్పడంతో అందరూ భయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడే తప్పు ఓప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం బొబ్బిలి ఏజేఎఫ్సీఎం కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
![]() |
![]() |