ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల వద్ద కొబ్బరి కాయలు, పూలు, పూజసామగ్రిని అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై స్పందించింది. ధరలు తగ్గించి, భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాపారులతో మాట్లాడి, ధరలు తగ్గించాల్సిన బాధ్యత ఈవోలదేనని స్పష్టం చేసింది. దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ఎంఆర్పీకే విక్రయించేలా చూడాలని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీ చేశారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే లైసెన్సు రద్దు చేస్తామనే నిబంధన వేలం నిర్వహించే ముందే వ్యాపారులకు తెలియజేయాలన్నారు. దీనిపై విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.