తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలకు చెక్ పెట్టింది. వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వర్శిటీల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు.అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమని తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. వీసీల నియామకంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన తెలిపారు. అంతేగాక వర్శిటీ పాలనావ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోందనీ అన్నారు.