ఇల్లు లేని నిరుపేదలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. త్వరలో రెండో దశ ప్రారంభం అవుతుందని, ఇల్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాఖలో పర్యటన నేపథ్యంలో సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. 30.7 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నామని, ఇందు కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలో వస్తున్నాయని వెల్లడించారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే రెండో దశలో వారికి సొంతిల్లు కల్పిస్తామని వివరించారు.
బహిరంగ సభలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ విమర్శలతో విరుచుకుపడ్డారు. తాము పేదలందరికీ ఇల్లు కల్పించాలని నిశ్చయించుకున్నామన్నారు. అయితే తమ సంకల్పాన్ని చెడగొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నాయని చెప్పారు. పేదలకు మంచి చేశాననే పేరు తనకు దక్కకూడదని కుటిల యత్నాలకు పాల్పడుతున్నాయన్నారు. అనంతరం స్థానికంగా నిర్మించిన మోడల్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. తర్వాత పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు.