కరోనా కారణంగా ఏపీలో రెండేళ్లు పదో తరగతి పరీక్షలు జరగలేదు. అయితే ఈ విరామం తర్వాత బుధవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే తెలుగు పరీక్ష ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇన్విజిలేటర్‌గా ఉన్న వ్యక్తి దానిని వాట్సాప్‌లో ఇతరులకు పంపించాడు. ఇది మరువక ముందే రెండో రోజు హిందీ పేపర్ కూడా సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలూ చిత్తూరు జిల్లాలోనే జరగడం గమనార్హం. తెలుగు పేపర్ విషయంలో పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందనీ, దానిని పేపర్ లీక్‌గా భావించలేమని అధికారులు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా సెంటర్లలో గురువారం పరీక్ష ప్రారంభమైంది. కొద్ది సేపటికే హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని తెలుస్తోంది. మరో వైపు చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి హైస్కూల్ సెంటర్ నుంచి కూడా హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిందని ప్రచారం సాగుతోంది. దీంతో ఈ రెండు ఘటనలపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు.