మాములుగా మన ఇళ్లల్లో సగ్గుబియ్యంతో ఎలాంటి వెరైటీలు చేస్తాం? మహా అయితే పాయసం, లేకపోతే పల్చగా జావలా కాసుకొని తాగుతాం. అలా కాకుండా ఈ సారి సగ్గుబియ్యంతో కిచిడీ చెయ్యండి. దీనిని మీరు ఒక్కసారి రుచి చూశారంటే వదలరంతే. అంత రుచిగా ఉంటుంది. ఈవెనింగ్ స్నాక్స్ కి చక్కటి పరిష్కార మార్గం. ముఖ్యంగా పిల్లలకి ఈ వెరైటీ బాగా నచ్చుతుంది. ఇంకేముంది... పిల్లలు స్కూల్ నుండి వచ్చే లోపు ఈ రెసిపీని చేసి వాళ్ళకి ఇస్తే ఎంతో ఇష్టంగా ఇట్టే తినేస్తారు. సగ్గుబియ్యం మన శరీరానికి చాలా చలవ చేస్తుంది. శరీరంలో అధిక వేడిమి ఉన్న వాళ్ళు సగ్గుబియ్యం తింటే వేడి ఇట్టే తగ్గిపోతుంది.
ముందుగా దీనిని తయారుచెయ్యటానికి కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దాం.
సగ్గుబియ్యం - ఒక కప్పు, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు - అర టీ స్పూన్, పచ్చిమిర్చి - రెండు,
బంగాళదుంప -1, ఉప్పు -తగినంత, మిరియాల పొడి -అర టీ స్పూన్, పంచదార -1 స్పూన్, టమాటా -1, వేయించిన వేరుశెనగ గింజల పొడి- అర కప్పు, ఆయిల్ -సరిపడినంత, కొంచెం కరివేపాకు,కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
ముందుగా సగ్గుబియ్యాన్ని నీటితో బాగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత వడకట్టి ఫ్యాన్ కిందగానీ, ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. అవి ఆరేలోపు బంగాళాదుంప, టొమాటోలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక బాండీ ని పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి బాగా కాగిన తర్వాత తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత బంగాళాదుంప ముక్కలను కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుని అందులో కొంచెం ఉప్పు (మీ రుచికి తగ్గట్టు), మిరియాల పొడి వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అడుగున నెయ్యి రాసిన మంద పాటి చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో ఇందాక నానబెట్టిన సగ్గుబియ్యం, కొత్తిమీర తరుగు వేసి ఉంచాలి. ఇప్పుడొక ఇడ్లి పాత్రలో కొంచెం నీళ్లు పోసి ఒక స్టాండ్ లాంటి దానిని అందులో వేసి దాని మీద ఇందాక తయారు చేసి పెట్టుకున్న మందపాటి గిన్నెను ఉంచి మూత పెట్టెయ్యాలి. పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.