మే 27, 28 తేదీల్లో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటలో జాతీయ రహదారి పక్కన 80 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ పసుపు పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది హాజరవుతారని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో మహానాడు ఏర్పాట్లపై సమీక్షించారు. మహానాడు నిర్వహణ కోసం మొత్తం 15 కమిటీలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
మే 27న తొలి రోజు నిర్వహించే ప్రతినిధుల సభకు 10 వేల మంది హాజరవుతారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు మహానాడు ప్రారంభమౌతుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఒకేసారి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహానాడు ప్రాంగణంలో వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యశాలలకు తరలించేలా అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని చంద్రబాబు సూచించారు. సమీక్షలో పార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.