భారత ఆర్మీ 29వ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత జనరల్ ఎంఎం నరావనే స్థానంలో ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. ఫిబ్రవరి 1న ఆయన ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు పాండే నాయకత్వం వహించారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రంగాలలో వాస్తవ నియంత్రణ (ఎల్‌ఐసి) లైన్ వద్ద ఆయన విధులు నిర్వహించారు. భారతదేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ పాండే భారత సైన్యం బాధ్యతలు స్వీకరించారు.
జనరల్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయనను డిసెంబర్ 1982 లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (బొంబాయి సాపర్స్)లో నియమించారు. లడఖ్‌లోనూ, జమ్మూ కాశ్మీర్‌లోనూ ఆయన విధులు నిర్వర్తించారు. జనరల్ పాండే ఇథియోపియా, ఎరిట్రియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఇక త్రివిధ దళాలున్న అండమాన్ & నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన అందించిన సేవలకు గానూ పరమ్ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనకు ప్రదానం చేశారు.