పురుషుల్లో కంటే.. మహిళలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి నెల వచ్చే పీరియడ్స్ అలాంటిదే. ఆ సమయంలో నడుము నొప్పి, తలనొప్పి, కడుపులో నొప్పి, వికారం, నీరసం వంటివి అనుభవిస్తుంటారు. అలాంటిదే మెనోపాజ్ దశ కూడా.
యుక్త వయస్సులో మొదలయ్యే పీరియడ్స్ 45 ఏళ్లు దాటిన తర్వాత దూరం అవుతాయి. దానినే మెనోపాజ్ అంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో వయస్సులో మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ దశ తర్వాత మహిళల్లో పూర్తిగా పీరియడ్స్ ఆగిపోతాయి. దీంతో ప్రతినెలా అయ్యే రక్తస్రావం ఆగిపోతుంది. పీరియడ్స్ ఆగిపోవడం అంటే వారిలోని ఓవరీలు పనిచేయడం పూర్తిగా నిలిచిపోయినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ దశలో స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.
అయితే ఈ మెనోపాజ్ సమయంలో ఎన్నో శారీరక సమస్యల్ని మహిళలు అధిగమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు అస్తవ్యస్థంగా మారతాయి. దాంతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. మెనోపాజ్ అయ్యే ముందు నెలల్లో సరిగ్గా పీరియడ్స్ రావు. వచ్చినా రక్తస్రావం పెద్దగా అవ్వదు. ఒక్కో నెలా అధిక రక్తస్రావం అయ్యే సమస్య ఉంటుంది.
అలాగే ఆ సమయంలో మహిళల్లో వేడీ ఎక్కువగా ఉంటుంది. అధికంగా చెమటలు పడతాయి. నిద్ర పట్టకపోవడం, జుట్టు రాలిపోవడం, లైంగిక వాంఛలు తగ్గిపోవడం, హార్ట్‌బీట్ పెరిగిపోవడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే తరచూ మూడ్ మారిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి.
కానీ ఈ దశను హ్యాండిల్ చేయడం అంత తేలికైనా విషయం కాదు. ఈ దశలో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తమ తమ శారీరక అవస్థలను బట్టి.. ఈ విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.