1920 ప్రాంతం విశాఖలోని మన్యసీమ..తరతరాలగా అడవితల్లినే నమ్ముకొని జీవిస్తున్న అమాయక ఆదివాసీగిరిజనలు..అడవిలో దొరికే పండ్లు,కాయలు,గింజలు,తేనే సేకరించి అమ్ముకోవడం , పోడువ్యవసాయం చేసి జీవించడం వారి జీవనవిధానం..నాగరికత అంతగా తెలియదుగానీ నీతినిజాయితీలకు మాత్రం కొదవలేదు వాళ్ళ మనసులలో..ఆత్మాభిమానం మెండు,.ఎవరికీ కీడు చేయని నైజం వారిది.
అలాంటి అమాయకజీవులను సహితం వదలలేదు నాటి ఆంగ్లేయప్రభుత్వం. వారు సేకరించే అటవీసంపదపై పన్నులు వేశారు. తక్కువరేటుకు కొనడం మళ్ళీ అధికరేటుకు ఆ అమాయకులకు అమ్మడం ప్రభుత్వపాలకుల దోపిడీ.పోడు వ్యవసాయం పై సహితం ఎన్నో అంక్షలు. అలాంటి పరిస్థితులలో ఆథ్యాత్మికచిత్తంతో అక్కడకు వచ్చాడో 20 యేండ్ల యువకుడు. తెల్లని వస్త్రాలు,పెరిగినగడ్డం,కళ్ళలో ఏదో వింత మెరుపు. ఆ యువకుడిని చూడగానే ఆ మన్యం వాసులు ఈయనెవరో తమను రక్షించడానికి వచ్చిన వ్యక్తిగా భావించారు..తెలియని ఆరాధన కలిగింది వారిలో.అందుకేనేమో అతను వారి సమస్యల పట్ల స్పందించాడు.
1920 ప్రాంతంలో మన్యసీమలో రెవెన్యూ ఆఫీసర్ గా వచ్చాడు బాష్టియన్ అనే అధికారి. పరమనికృష్టుడు. ఆదివాసీల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించేవాడు. రోడ్లు,భవానాల నిర్మాణాలకు వారిని "వెట్టికూలీలుగా"ఉపయోగించుకోనేవాడు. ఆడవారి అత్యాచారాలు లెక్కలేదు. జంతువులకంటే హీనంగా చూసేవాడు. ఇవన్నీ గమనించాడాయువకుడు. ఈ అరాచకాలపై సవివరణంగా నాటి కలెక్టర్ కు అర్జీ పెట్టాడు. కానీ ఆయన పట్టించుకోలేదు..సరికదా ఆ యువకుడి మీదే నేరము మోపి జైలుకు పంపారు. కానీ అక్కడ ఒక గుమస్తా ఆ యువకుడికి సహాయం చేసి జైలునుండి తప్పించాడు.
మళ్ళీ అడివికి వెళ్ళాడాయువకుడు. శాంతి చర్చలు పనికిరావనుకున్నాడు. సాయుధపోరాటమే దీనికి పరిష్కారం అనుకున్నాడు. అంతే అమాయక ఆదివాసీ యువకులను కరుడుగట్టిన గెరెల్లా యోధులుగా చేసేందుకు నడుంబిగించాడు. అప్పటికే ఈ దౌర్జన్యాలకు వ్యతిరేఖంగా పితూరీ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న గామ్ గంటన్నదొర ఆయనకు జత కలిశాడు.
మన్యం ప్రజలు పన్నులు కట్టడం మానేశారు.వెట్టిపనికి పోవడం మానేశారు. మన్యం యువకులతో ఆ యువకుడు ప్రభుత్వ పోలీసుస్టేషన్స్ పై దాడి చేసి ఆయుధాలను అపహరించడం,ప్రభుత్వధాన్యాగారాలపై దాడి చేసి వాటిని పేదప్రజలకు పంచడం ప్రారంభించాడు.
మన్యపోరాటంతో భీతిల్లిన ఆంగ్లేయప్రభుత్వం విప్లవాలను అణచడంలో మంచి పేరున్న రూథర్ ఫర్డ్ ను కలెక్టర్ గా విశాఖకు పంపంది. అలాగే పిరంగులను ,మందుగుండు సామగ్రిని ,సైన్యాన్ని మన్యసీమకు పంపింది. అలాగే మేజర్ జనరల్ స్తాయి అధికారి అయిన "గుడాల్ "ను దీనికి వ్యూహకర్తగా పంపింది. సైనక జనరల్ స్తాయి వ్యక్తిని ఒక తిరుగుబాటును అణచడానికి పంపడం అప్పట్లో సంచలనం.
అయినా ఆ యువకుడు జంకలేదు. ప్రభుత్వకార్యాలయాలపై దాడి ఆపలేదు. ఏ సమయంలో దాడి చేస్తాడో చెప్పి మరీ అదే సమయానికి దాడి చేయడం అతని ప్రత్యేకత..మన్యసీమ మొత్తం ఆ నాయకుడిని దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు.." చింతపల్లి పోలీసుస్టేషన్ పై దాడి చేసినప్పుడు ఆ యువకుడిని చూసిన ఒక పోలీసు "అతను నడిచివస్తుంటే గాండీవంను ధరించిన అర్జునుడు "ను చూసినట్లు అనుభూతి పొందానని డైరీలో రాసుకున్నాడు.
మన్యం తిరుగుబాటు క్రమంగా మైదానాలకు వ్యాపించిసాగింది. ఆంగ్లేయులు రాబోవు ముప్పును గుర్తించి మద్రాసు నుండి అదనపు బలగాలను రప్పించారు. రూథర్ పర్డ్ ,జనరల్ మేజర్ గుడాల్ నీచపు పథకాన్ని రచించారు. అమాయకులైన గిరిజనులను బంధించి వేధించడం ప్రారంభించారు. ఆ యువకుడి ఆచూకీ చెప్పమని వారిని హింసించసాగారు. ఆడవారి పట్ల చాలా దారుణాతిదారుణంగా వ్యవహరించారు. చాలామంది తిరుగుబాటుదారులను పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు.
ఈ దారుణాలను చూసి చలించి పోయిన ఆ యువకుడు అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు తాను లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమాయకులను వదిలబెట్టండి నేను లొంగిపోతానంటూ రూథర్ ఫర్డ్ కు వర్తమానం పంపాడు.రూథర్ ఫర్డ్ అతనిని చర్చలకు అహ్వానం పంపాడు.1924 మే 7 ఉషోదయసమయాన ఒక చెరువులో సూర్యవందనం చేసి నిరాధుడిగా వస్తున్న ఆ యువకుడిని జనరల్ గుడాల్ తన సైన్యంతో చుట్టిముట్టి నిర్ధాక్షణ్యంగా కాల్చిచంపాడు. ఎటువంటి విచారణ లేకుండానే..తర్వాత ఫోటో తీసుకొని అతనిని దహనం చేశారు.
ఆ యువకుడి పేరే మన్యం వీరుడుగా పేరుపొందిన అల్లూరి,సీతారామరాజు. మన్య ప్రజల గుండే చప్పుడు" ఎవరి న్యాయకత్వంలో పనిచేయకుండా స్వతంత్రంగా తనకున్న పరిమితమైన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆంగ్లేయప్రభుత్వాన్ని గడగడలాండించిన తెలుగు విప్లవ వీరుడు. మనదేశ నాయకుల అసమర్థత వల్ల ఆయనకు సంబందించిన విషయాలన్నీ మరుగున పడిపోయాయి.ఆయన చరిత్రకు సంబందించిన ఆనవాళ్ళు లేకుండా పోయాయి.
"మన్యం వీరుడు అల్లూరికి నివాళులు..జోహార్ అమరవీరుడు అల్లూరి".