తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే తరహాలో జరిగిన ఈ దాడిలో అప్రమత్తమైన పోలీసులు నక్సల్స్ దాడులను తిప్పి కొట్టారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తోగుడెం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో మావోయిస్టులు దాడికి పాల్పడినట్లు తెలిసింది. మావోయిస్టు ఈ సందర్భంగా చాలా సేపు జవాన్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపుపై కూడా మావోయిస్టులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విరోచితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా మావోయిస్టులు రాకెట్ లాంచర్‌లను వినియోగించినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. పక్క పక్కనే ఉన్న రెండు సరిహద్దు రాష్ట్రాల్లో మావోయిస్టులు రెండు గంటల వ్యవధిలో రెండు పోలీస్ క్యాంపులపై దాడికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటనలకు సంబంధించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.