ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ పలువురు మరణాలకు కారణమవుతున్నాయని అని ఆయా ప్రాంతాలను గుర్తించి గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన రహదారు లైన కోలార్ -చిత్తూరు, పలమనేరు -కుప్పం, పలమనేరు -పుంగనూరు, చిత్తూరు- పి కొత్తకోట లకు చెందిన జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా చిత్తూరు - చెన్నై జాతీయ రహదారి పై పనులు పెండింగ్ లో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అదే విధంగా జాతీయ రహదారులకు సంబంధించి, ఇతర ప్రధాన రహదారులకు సంబంధించి రోడ్లకు ఇరువైపులా గుర్తింపు ఉండేలా చూడాలన్నారు. ప్రమాదాల గురించి తెలిసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు, ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ వారు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రోడ్ లను గుర్తించి ప్రమాదాలకు గల కారణాలను పరిశీలించి నివారించాలని అన్నారు.