చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలో వర్గపోరు ముదిరి కిడ్నాప్, దాడుల వరకు వెళ్లింది. చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీకి ఇన్చార్జ్ గా పార్టీ ఎవ్వరినీ నియమించలేదు. అయితే గత కొంత కాలంగా మంగళంలో నివాసం ఉండే పార్టీ జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ పార్టీ ఇన్చార్జ్ అని చెప్పుకుంటున్నాడు. రామచంద్రాపురం మండలం నెత్తకుప్పంకు చెందిన చరణ్ రాయల్ దీనిని ప్రశ్నించాడు. పార్టీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టాడు. దీంతో కక్ష పెంచుకున్న మనోహర్ తన అనుచరులతో వారం క్రితం చరణ్ రాయల్ పై దాడి చేయించాడు. బలవంతంగా సోషల్ మీడియాలోని మనోహర్ కు వ్యతిరేకంగా ఉన్న పోస్టింగ్ లను తొలగించారు. దీనిపైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు చరణ్ రాయల్ ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉంటే మనోహర్ కు వ్యతిరేఖంగా ఎందుకు ఫిర్యాదు చేస్తావంటూ సోమవారం సాయంత్రం నెత్తకుప్పం నుంచి తిరుపతికి వస్తున్న చరణ్ రాయల్ ను కొందరు రాయలచెరువు రోడ్డులో అడ్డుకున్నారు. బైక్ నుంచి అతన్ని బలవంతంగా దించి ఆటోలో ఎక్కించుకుని దాడికి పాల్పడ్డారు. ఆటోను మనోహర్ నివాసం ఉండే మంగళం వైపు మళ్లించారు. అయితే తనను కిడ్నాప్ చేసి దాడి చేస్తున్నారని, అన్నమయ్య సర్కిల్ వైపు తీసుకెళ్తున్నారని, తనని కాపాడాలని చరణ్ రాయల్ తన స్నేహితుడు బాలారాయల్ ను ఫోన్ ద్వారా కోరాడు. దీంతో అన్నమయ్య సర్కిల్ వద్ద బాలారాయల్ ఆటోకు తన బైక్ ను అడ్డుపెట్టి చరణ్ రాయల్ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఇరువర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన మొత్తం అన్నమయ్య సర్కిల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న చరణ్ రాయల్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దేవర మనోహర్, సాయి, మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు రామచంద్రాపురం ఎస్ఐ గిరిబాబు తెలిపారు.