ఎంత అవగాహన తీసుకొచ్చినా మనలో మార్పు రావడంలేదు. మనలోని అమాయకత్వాన్నే సైబర్ నేరగాళ్లు తమ యోసాలకు అనువుగా మార్చుకొంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో తాజాగా చోటుచేసుకొంది. కరెంట్ బిల్లు పేరుతో ఓ వ్యక్తిని నిండా ముంచేశారు సైబర్ కేటుగాళ్లు.. ఓ లింక్ పంపి ఓటీపీతో ఏకంగా రూ.8.50 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నమ్మితే చాలు ఏదో రకంగా నిండా ముంచేస్తున్నారు. కరెంట్ బిల్లు పేరుతో ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.8 లక్షలకు పైగా కాజేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకు చెందిన వ్యక్తి ఫోన్‌కు కరెంట్ బిల్లు కట్టాలని, లేదంటే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. దీంతో అతడు ఇటీవల అమెరికా నుంచి వచ్చిన తన కొడుక్కి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్‌కి ఫోన్ చేశాడు. దీంతో ఆ కేటుగాళ్లు అతనికి ఒక లింక్, ఓటీపీ పంపించారు. అతనికి ఓటీపీ అందగానే.. బ్యాంక్ అకౌంట్‌లో నుంచి రూ.8 లక్షల 50 వేలు కట్ అయిపోయాయి. ఈ విషయం గ్రహించిన సదరు వ్యక్తి.. మోసపోయానని తెలుసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.