వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ, వైసీపీ మధ్యే ఈ పోరు సాగగా...తాజాగా మేం అధికార పీఠం కోసమే ఉన్నామని రంగంలోకి జనసేన పార్టీ, బీజేపీ కూడా దూకుడు పెంచుతోంది. ఇదిలావుంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నినాదం. ఆ తర్వాత తిరుగులేని మెజార్టీతో, 151మంది ఎమ్మెల్యేలతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే నినాదన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అందుకున్నారు. ప్రకాశం జిల్లా కౌలు రైతు భరోసా యాత్ర, అనంతరం జరిగిన సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ జనసేనకు అండగా ఉండాలని కోరారు. రాష్ట్రానికి కాపాడే బాధ్యతను తాను తీసుకుంటాను అన్నారు. ఇప్పటి వరకు చాలామందికి అవకాశం ఇచ్చారని.. ఒక్కసారి జనసేన నమ్మి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇప్పుడే ఇదే నినాదాన్ని మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు అందుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపటి మంచి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, మంచి భవిష్యత్‌ను భావి తరాలకు అందించడం కోసం ఛాన్స్ ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పవన్‌ను ఎవరూ నమ్మరంటూ కామెంట్స్ చేస్తున్నారు.