స్వింగ్‌తో చెలరేగుతున్న బౌలర్లు. ప్రత్యర్థి ప్రమాదకర బౌలింగ్ ను లెక్కచేయని బ్యాటర్లు.. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ గడ్డపై మరో సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియా. ఇప్పటికే ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. నేడు లార్డ్స్ వేదికగా బట్లర్ సేనతో రెండో వన్డేలో రోహిత్ సేన తలపడనుంది. తొలి వన్డేలో విజయం సాధించాలనే ఉత్సాహంతో ఉన్న భారత్.. అదే జోరును కొనసాగించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20 సిరీస్, తొలి వన్డే ఓటమి తర్వాత ఇంగ్లండ్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని కూడా ఈ మ్యాచ్ అందించనుంది. కానీ ఇంగ్లాండ్‌లో వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రీషెడ్యూల్ అయిన టెస్టుకు వరుసగా మూడు రోజుల పాటు అంతరాయం కలిగించిన వరుణుడు ఆ తర్వాత ఇబ్బంది పెట్టలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డే కూడా రసవత్తరంగా సాగింది. లార్డ్స్ వాతావరణ విభాగం కూడా రెండో వన్డేకు వర్ష సూచన లేదని తెలిపింది. లార్డ్స్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనున్నందున సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గరిష్టంగా 24 డిగ్రీలు.. కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశాన్ని మేఘాలు ఆవరించే అవకాశం ఉన్నా.. వర్షం కురిసే సూచనలు కనిపించడం లేదు. ఉదయం 12 గంటల వరకు ఎండ, ఆ తర్వాత పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది.