పచ్చళ్లు, మసాలా వంటకాలు, స్నాక్స్‌లో ఉప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినేవారికి బాడీలో ఉప్పు ఎక్కువవుతుంది. సాల్ట్ ఏమాత్రం ఎక్కువైనా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుందని ఎపిడెమియోలజీ జర్నల్ లోని ఓ అధ్యయనం చెబుతోంది. ఉప్పు అంటే సోడియం. ఇది బాడీకి సరిపడా మాత్రమే అందాలి. ఎక్కువగా అందిస్తే ప్రమాదం. చాలా మందికి తాము సరిపడా ఉప్పును వాడుతున్నదీ లేనిదీ తెలియదు. ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే ఉప్పు తగ్గించాలనో, లేక మరికాస్త పెంచాలనో చెబుతుంటారు. అందుకే ఉప్పు సరిపడా తీసుకుంటున్నదీ లేనిదీ తేల్చుకునేందుకు ఇలా చెయ్యాలి.
జనరల్‌గా ఓ వ్యక్తి రోజుకు 7.2 గ్రాముల ఉప్పు వాడుతారు. ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది. తక్కువైతే లోబీపీ వస్తుంది. ఎవరైనా సరే రోజూ 6 గ్రాముల దాకా మాత్రమే ఉప్పును వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉప్పు ఎక్కువైతే మనలో ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
మాటిమాటికీ యూరిన్ (ఒకటికి) వెళ్తున్నారా అయితే మీరు ఉప్పు కాస్త తగ్గించాలి. చాలా మంది అర్థరాత్రి నిద్రలేస్తారు. ఒకటికి వెళ్తారు. అంటే వారు ఉప్పు ఎక్కువగా వాడుతున్నట్లే. ఐతే ఇందుకు ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఉప్పే కారణం అవుతుంది. మాటిమాటికీ దాహం వేస్తున్న ఫీలింగ్ కలుగుతోందా? అయితే ఉప్పు తగ్గించాలి. అధిక సోడియం మన బాడీలోకి వెళ్లాక లోపలి ద్రవాల క్రమపద్ధతిని పాడుచేస్తుంది. అందువల్ల దాహం వేస్తుంటుంది. ఐతే సోడియం బ్యాలెన్స్ సరిచేసేందుకు మీరు చేయాల్సింది ఎక్కువ నీరు తాగడమే.
శరీరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉబ్బినట్లు అవుతోందా? చేతులు, కాళ్లపై ఉబ్బినట్లు కనిపిస్తోందా? అక్కడ టచ్ చేస్తే మెత్తగా ఉంటోందా అయితే అది సాల్ట్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు. బాడీలోని కణజాలాల్లో ఎక్కువగా ద్రవాలు ఉండిపోతే ఇలా అవుతుంది. బాడీలో సాల్ట్ ఎక్కువైనప్పుడే అలా ద్రవాలు ఉంటాయి. వెంటనే మీరు చేయాల్సింది ఉప్పు తక్కువగా వాడటమే. మీరు తినే ఆహారం మీకు నచ్చట్లేదా? ఇంట్లో అందరికీ ఉప్పు సరిపోతున్నా మీకు సరిపోనట్లు అనిపిస్తోందా? అంటే మీరు ఉప్పు ఎక్కువగా వాడుతున్నట్లే. కంటిన్యూగా ఎక్కువ ఉప్పు వాడితే నోట్లోని రుచి నాళికలు కూడా దానికి అలవాటు పడిపోతాయి. కానీ ఇది మంచిది కాదు కాబట్టి ఉప్పును తగ్గించాలి.
ఇది మరో ప్రమాదకర లక్షణం. మీకు తరచూ తలనొప్పి వస్తోందా? బాడీలో సరిపడా ద్రవాలు లేనప్పుడు తలనొప్పి వస్తుంది. ద్రవాలు అలా సరిపోవట్లేదంటే బాడీలో ఉప్పు ఎక్కువ అవుతున్నట్లే. ఈ తలనొప్పి ఎక్కువ సేపు ఉండదు. నీరుతాగగానే తగ్గిపోతుంది. ఐతే మళ్లీ మళ్లీ అలా వస్తూనే ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి.
కొంతమందికి స్వీట్లు తెగ నచ్చుతాయి. ఆటోమేటిక్‌గా వారి బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంత మంది స్పైసీ ఫుడ్ బాగా నచ్చుతుంది. అందులో ఉప్పు ఎక్కువ కాబట్టి వారికి అదే నచ్చుతూ ఉంటుంది. అలా మీకూ జరుగుతూ ఉంటే మీరు జాగ్రత్త పడాల్సిందే. ఉప్పు వేసిన వేరుశనగలు, ఉప్పుతో బఠాణీలు, ఉప్పుతో మరమరాలు, ఉప్పుతో చిప్స్, ఉప్పుతో కరకరలాడేవి తినాలని మీకు అనిపిస్తూ ఉంటే మీరు కచ్చితంగా ఉప్పు తగ్గించుకోవాలి. లేదంటే ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకున్టట్లు అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.