నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ హారర్ మూవీ ఉల్లాల ఉల్లాల. ఒకప్పటి టాలీవుడ్ విలన్ సత్య ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది.
కథ : పండు (నటరాజ్) ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనే గోల్ పెట్టుకుని ఆ దిశగా కలలు కంటూ ఉంటాడు. అయితే నూరి (నూరిన్ షరీఫ్) నటరాజ్ ను ప్రేమిస్తూ అతని వెంటపడుతున్నా.. కోట్ల రూపాయిలను కట్నంగా తీసుకొచ్చే అమ్మాయే తన భార్యగా రావాలని కోరుకుంటుంటాడు నటరాజ్. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా త్రిష (అంకిత మహరాన) అలాగే ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు అతని జీవితంలోకి వస్తారు. ఇక త్రిష. చనిపోయిన తన భర్తను నటరాజ్ లో చూసుకుంటూ అతనితో రొమాన్స్ చేస్తూ అతన్ని రెచ్చిగొడుతూ ఉంటుంది. కానీ అంతలో ఆమె భర్త తిరిగివచ్చి చుట్టూ ఉన్న వ్యక్తులతో పాటు అతను నటరాజ్ ను పై దాడి చేయడం లాంటి గందరగోళ పరిస్థితుల్లోకి ప్రవేశించిన ఈ కథ చివరికీ ఎలా ముగిసింది ? అసలు త్రిష అలాగే ఆమె చుట్టూ ఉన్న మనుషులు ఎవరు ? నటరాజ్ తోనే వాళ్ళు ఎందుకు అలా వింతగా బిహేవ్ చేస్తున్నారు ? ఫైనల్ గా నటరాజ్ వారి నుండి బయటపడ్డాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందంటే.. అంకిత మహరాన అందచందాలే. బి.సి ఆడియన్స్ ను ఆకర్షించేలా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తన గ్లామర్ తో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయి మరి రొమాంటిక్ సన్నివేశాల్లో జీవించేసింది. బికినీలోనూ సైతం కనిపించి అంకిత మహరాన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక హీరోగా నటించిన నటరాజ్ బాగా నటించడానికి చేసిన ప్రయత్నం అండ్ హార్డ్ వర్క్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. నటరాజ్ కి అంకిత మధ్యన సాగిన బోల్డ్ సన్నివేశాలు సినిమా బాగున్నాయి. ఇక భయంకరమైన లేడి పాత్రలో నటించిన విలన్ ప్రభాకర్ తన గెటప్ తోనే భయపెట్టేలా ఉన్నాడు. పృథ్వీరాజ్, అప్పారావు అలాగే సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ : ఈ సినిమా బ్యాడ్ స్టోరీతో సిల్లీ స్క్రీన్ ప్లేతో ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని సన్నివేశాలతో సాగుతూ ఆసాంతం బాగా బోర్ గా సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ తో ఓవర్ ఎక్స్ పోజింగ్ తో ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సెకెండాఫ్ దెబ్బకి ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదనిపించే ఆ కొన్ని సీన్స్ కూడా పూర్తిగా తేలిపోయాయి. అసలు సినిమా మొత్తం గమ్యం లేని ప్రయాణంలా సాగుతూ.. అనవసరమైన సన్నివేశాలతో కనీస ఇంట్రస్ట్ కూడా కలిగించలేక ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఇబ్బంది పెడుతొంది. దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న అంశాలు విజువల్ గా మరియు ఇన్సిడెంట్ల రూపంలో కాకుండా.. ఒక్క క్లైమాక్స్ లో నాలుగు డైలాగ్స్ తో క్లారిటీ ఇవ్వడంతో అప్పటివరకూ సినిమా చూసిన ప్రేక్షకులు, అప్పటికే పూర్తిగా నీరసించిపోతారు. దీనికితోడు వికారం పుట్టించే ప్రభాకర్ గెటప్ తో మరియు సౌండ్ పొల్యూషన్ తప్ప నవ్వు రాని కామెడీ సీన్స్ తో తట్టుకోలేక బాగా అసహనానికి గురవవుతాం. పైగా హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ కూడా క్లారిటీ మిస్ అయి విసుగు పుట్టిస్తాయి. ఇక సినిమాలో పూర్తి నాటకీయత ఎక్కువడంతో కథలో కొన్ని చోట్ల కూడా సహజత్వంతో కూడిన సీన్స్ లేకుండా పోయాయి. ఓవరాల్ గా బలహీనమైన కథాకథనాల మరియు గందరగోళ పరిచే సంఘటనల కారణంగా ఈ సినిమా ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం : ఈ చిత్ర దర్శకుడు సత్య ప్రకాష్ స్క్రిప్ట్ తో పాటు తన దర్శకత్వ పనితనంతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాడు. కొన్ని బోల్డ్ సీన్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు గాని అది పూర్తీ సంతృప్తికరంగా సాగలేదు. ఆయన సెకెండడాఫ్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే సినిమా కొంతవరకు అయినా పర్వాలేదనిపించేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగాలేదు. ఎడిటింగ్ గురించి, ఎడిటర్ పనితనం గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకోక్కర్లేదు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు బాగున్నాయి.
తీర్పు : రొమాంటిక్ హారర్ మూవీ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దర్శకుడు రొమాంటిక్ సీన్స్ రాసుకున్నప్పటికీ.. చివరికీ ఆ రొమాన్స్ కూడా ఈ సినిమాని నిలబెట్టలేకపోయింది. దీనికి తోడు సెకెండాఫ్ మరి దారుణంగా సాగుతూ బాగా బోర్ కొడుతొంది. మొత్తానికి బ్యాడ్ స్టోరీతో సిల్లీ స్క్రీన్ ప్లేతో గందరగోళ పరిచే సంఘటనల సమ్మేళనంతో సినిమా ఆకట్టుకోదు. అయితే సినిమాలో నటరాజ్ – అంకిత మహరాన మధ్యన వచ్చే కొన్ని బోల్డ్ సీన్స్ యూత్ కి కాస్త ఉపశమనం కలిగిస్తాయి.
నటీనటులు : నటరాజ్, అంకిత మహరాన, నూరిన్ షరీఫ్ తదితరులు
దర్శకత్వం : సత్య ప్రకాష్
నిర్మాతలు : ఏ గురురాజ్
సంగీతం : జాయ్
సినిమాటోగ్రఫర్ : జె. జి. కృష్న , దీపక్
ఎడిటర్: ఉద్ధవ్
రేటింగ్ : 1.5/5.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa