బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన కరణ్ జోహార్ బుల్లితెరపై చేస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. 2004లో ప్రారంభమైన ఈ టాక్ షో 2019 వరకు స్టార్ వరల్డ్, స్టార్ వన్ ఛానెళ్లలో నిర్విరామంగా ప్రసారం చేయబడింది. నటీనటులు వారి కొత్త సినిమా విడుదలయ్యే తరుణంలో ఈ టాక్ షోలో పాల్గొని కాఫీ తాగుతూ సినిమా ముచ్చట్లను చెప్పుకుంటారు. బాలీవుడ్ లో ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది.
కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ ఈసారి ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో లో పాల్గొనే సెలెబ్రిటీల లిస్టును కరణ్ ఆల్రెడీ సిద్ధం చేసిపెట్టాడు. లైగర్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్యా పాండే ఒక ఎపిసోడ్ లో , క్రేజీ హీరోయిన్ సమంత మరో ఎపిసోడ్ లో కనిపిస్తారని, అందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయిందని వార్తలు వస్తున్నాయి. సౌత్ నుండి ఈ షోలో పాల్గొనే లిస్టులో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా , మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే, తాజాగా ఈ షోలో విరాటపర్వం చిత్రబృందం రానా, సాయిపల్లవి కూడా పాల్గొనబోతున్నట్టు టాక్ వినబడుతుంది.
ఆదివారం విడుదలైన విరాటపర్వం ట్రైలర్ ను రానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది చూసిన కరణ్ జోహార్ రానా మరియు సాయిపల్లవి పై ప్రశంసల వర్షం కురిపించాడు. సాయిపల్లవికి తను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. అంతేకాక విరాటపర్వం మేకర్స్ ప్రచారకార్యక్రమాలను సాయిపల్లవికి అప్పగించారు. దీంతో సాయిపల్లవి వీలైనన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, టాక్ షోలలో పాల్గొని విరాటపర్వం సినిమాకు ప్రేక్షకుల్లో తగినంత బజ్ తీసుకురావాలని కోరుకుంటుంది. దీంతో కరణ్ కాఫీ షోలో వీరిద్దరూ పాల్గొనటం ఖాయమే అని క్లియర్ గా తెలిసిపోతుంది.