పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'చోర్ బజార్'. గెహన సిప్పి కధానాయిక. దళం,జార్జ్ రెడ్డి వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలను పొందిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్నారు. "రొమాంటిక్" సినిమా హిట్ తర్వాత రాబోతున్న ఈ చిత్రంతో విజయాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు ఆకాష్. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే,ఈ సినిమాతో సీనియర్ నటి, జాతీయ పురస్కార గ్రహీత ఊర్వశి అర్చన గారు సెకండ్ ఇన్నింగ్సును స్టార్ట్ చేయబోతున్నారు. దాదాపు 25 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి ఆకాష్ పూరీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో అందరి దృష్టి ఈ సినిమా పై పడింది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేసారు. కొత్తగా, విభిన్నంగా ఉండే సినిమాలకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరణ చూపిస్తారని, చోర్ బజార్ మూవీ కూడా అలాంటి సినిమా అవుతుందని బాలయ్య పేర్కొన్నారు. ఇందులో బచ్చన్ సాబ్ అనే తుంటరి యువకుడిగా ఆకాష్ నటించాడు. దిల్ కా ధడకన్ కోసం ఎలాగైనా గిన్నెస్ రికార్డ్ కొట్టాలి అని చెప్పే ఆకాష్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.