వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్, వాటినుండి రిలీఫ్ పొందేందుకు, ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు
టాలీవుడ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్లో వినోద ప్రధానంగా సాగే 'రాజా డీలక్స్' అనే కమర్షియల్ సినిమా చేయనున్నారనే టాక్ ఎప్పటినుండో వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు కధానాయికలు నటించనున్నారట. అందులో ఒకరిగా మలయాళ నటి మాళవికా మోహనన్ పేరు వినిపిస్తుంది. గతంలో తమిళ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒక పెద్ద స్టార్తో కలిసి తెలుగు సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రభాస్ రాజా డీలక్స్ కి సంబంధించిందే అయివుంటుందని జోరుగా ప్రచారం సాగింది.
మాళవికా మోహనన్ తమిళ, మళయాళ భాషలలో మంచి గుర్తింపు ఉన్న నటి. విజయ్ "మాస్టర్" తో స్టార్ హీరోయిన్ హోదా పొందింది.
తాజాగా ముంబై మీడియాతో మరోసారి ప్రభాస్ సినిమాపై హింట్ ఇచ్చింది మాళవిక. తన తొలి తెలుగు సినిమా గురించిన అధికారిక ప్రకటనను నిర్మాతలు మంచి సమయం చూసి ఎనౌన్స్ చేస్తారని, అప్పటివరకు ఎదురుచూడాలని చెప్పింది. మాళవిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభాస్ - మారుతీ సినిమా ఆగిపోలేదని చెప్పకనే చెబుతున్నాయి. ఒక పక్క మారుతి "పక్కా కమర్షియల్" సినిమా ఫ్లాప్ అవ్వడంతో ప్రభాస్ సినిమా అటకెక్కిందని ప్రచారం జరుగుతున్న వేళ మాళవిక ఇచ్చిన స్టేట్ మెంట్ అభిమానులను మరింత అయోమయానికి గురి చేస్తుంది. అసలు ఈ సినిమా నిజంగా ఉందా? లేదా? అన్నది తెలియాలంటే... ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా షూటింగులు ముగింపు దశకు చేరుకోవాలి.