కోల్‌కతా వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన తననెంతో బాధ పెట్టిందని నటి మాళవిక మోహనన్ విచారం వ్యక్తం చేశారు.మహిళల భద్రత గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మూలాలను కనుగొని వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు.
''ఇటీవల మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నేను ఓ ప్రమోషన్‌లో పాల్గొని మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ వార్త తెలిసింది. షాక్‌కు గురయ్యాను. ఇలాంటి ఘటనలు మహిళలను నిస్సహాయుల్ని చేస్తాయి. ఎలా.. ఎక్కడ ఎటు నుంచి ఆపద వస్తుందో తెలియడం లేదు. చాలా మంది స్త్రీలు ఇలాంటి ఘోరాల గురించి బయటకు చెప్పడానికి కూడా ఆలోచిస్తుంటారు. వారిపై జరిగిన దాడిని రహస్యంగా ఉంచుతున్నారు. చర్చించాలనుకుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి'' అని చెప్పారు.పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య విద్య నియంత్రణ సంస్థ జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని వైద్యకళాశాలలు, వసతిగృహాల్లో వారి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశిస్తూ వైద్య కళాశాలలకు అడ్వయిజరీ జారీ చేసింది.