బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నానా పటేకర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. 'వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు సమయానికి వెళ్లేవాడిని. పైప్ స్మోకింగ్, మద్యపానం చేసేవాడిని. తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించినా ఫుల్‌స్టాప్ పెట్టలేకపోయాను. సినిమానే నాలో మార్పు తీసుకొచ్చించి. సినిమా మెడిసిన్‌లాంటిది.' అని ఆమిర్ పేర్కొన్నారు.2022లో ‘లాల్ సింగ్ చద్దా’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’తో బిజీగా ఉన్నారు. మరోవైపు, డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతం తీసుకురానున్నారు. దాని గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘నా డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతతోపాటు భయం కూడా ఉంది. ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో దీనిని రూపొందించాలనుకుంటున్నా. భారతీయులుగా ఈ కథ మన రక్తంలో ఉంది. కాబట్టి, ఇది నాపై ఎంతో బాధ్యత పెంచింది. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో? లేదో? తెలియదు. కానీ నేను మాత్రం దీని కోసం వర్క్ చేయాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.