రచయితగా... నటుడిగా తనికెళ్ల భరణికి మంచిపేరు ఉంది. నాటక రంగం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చినవారిలో ఆయన ఒకరు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ... "నాటకాలు రాస్తూ వెళుతున్న నాకు 'కంచు కవచం' సినిమాతో రచయితగా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమాకి పనిచేయడం నాకు ఇష్టం లేక చెన్నై నుంచి వచ్చేశాను. ఆ తరువాత 'పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు' సినిమా కోసం వెళ్లాను... వచ్చేశాను" అని అన్నారు. "ఆ తరువాత చెన్నై వెళ్లినప్పుడు దర్శకుడు వంశీ గారికి నన్ను రాళ్లపల్లిగారు పరిచయం చేశారు. కామెడీ రాయాలని చెబుతూ, వంశీగారు నాకు ఏడు సీన్లు ఇచ్చారు. ఆ సాయంత్రానికే రాసుకుని తీసుకుని వెళితే వంశీ ఆశ్చర్యపోయాడు. నేను రాసిన సీన్లు చదివిన తరువాత, ఆయన అదే పనిగా నవ్వాడు. 'నాకు కావలసిన రైటర్ దొరికేశాడు... నెక్స్ట్ సినిమా మీరే రాస్తున్నారు' అని అన్నాడు. ఆ సినిమానే 'లేడీస్ టైలర్'."ఆ సినిమా తరువాత ఒక రచయితగా నేను వెనుదిరిగి చూసుకోలేదు. 'కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్... చెట్టుకింద ప్లీడర్... ఇలా ఓ అరడజను సినిమాల వరకూ నేనే రాశాను. 'లేడీస్ టైలర్' నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడిన సినిమా. రచయితగా నాకు ఒక స్థాయిని తెచ్చిపెట్టిన సినిమా అది. ఆ తరువాత నటుడిగా కూడా వేషాలు వేస్తూ వెళ్లాను. నటుడిగా 'శివ' సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 'యమలీల'తో నటుడిగా బిజీ అయ్యాను. ఆ సినిమా తరువాత నటుడిగా 26 సినిమాలకి సైన్ చేశాను" అని చెప్పారు.