సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి తెలియనివారుండరు. సినిమా సంగీతాన్ని పరుగులు తీయించినవారు ఆయన. అలాంటి ఇళయరాజా గురించి తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ మాట్లాడారు. "ఇళయరాజా గారి ఫస్టు సినిమా కొన్ని కారణాల వలన మధ్యలో ఆగిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి రెండో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. నేను ఆయన దగ్గర 30 - 40 సినిమాల వరకూ పనిచేశాను" అని అన్నారు. "నేను పనిచేసిన సంగీత దర్శకులంతా ఒక ఎత్తు .. ఇళయరాజాగారు ఒక ఎత్తు. వాయిద్యాల పరంగా ఇతర సంగీత దర్శకులు ఉపయోగించే కాంబినేషన్స్ ను ఆయన వాడేవారు కాదు. ఇళయరాజా గారు వన్ మేన్ షో. చాలా ఫాస్టుగా ఆయన కంపోజ్ చేస్తారు. ఉదయం 7 గంటలకు మొదలుపెడితే రాత్రి 9 గంటలకు ఒక సినిమాకి సంబంధించిన వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా పూర్తవుతుంది. మిగతా సగాన్ని మరుసటి రోజు చేసేవారు. అందువల్లనే ఆయన 1700 సినిమాల వరకూ చేయగలిగారు" అని చెప్పారు. "వచ్చిన సినిమాను వచ్చినట్టుగానే అప్పటికప్పుడు చేసేవారు. అలా ఆయన చేసిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆయన సంగీతం కారణంగా టాప్ హీరోలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఏ వాయిద్యాన్ని ఎక్కడ వాడాలో .. ఎంతవరకూ వాడాలో అనే ఒక ధర్మ ఆయనకి బాగా తెలుసు. ఆయన ఉపయోగించడం వల్లనే కొన్ని వాయిద్యాలకు ఒక ప్రత్యేకత వచ్చిందనేది వాస్తవం. నాతో పాటు చాలామంది సంగీత దర్శకులకు ఆయనే స్ఫూర్తి" అని చెప్పారు.