by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:46 PM
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఎటువంటి వాతావరణ నడుస్తుందో తెలియడానికి. మరీ ముఖ్యంగా ఏపీలో ఎన్నికల టైమ్‌లో అల్లు అర్జున్ చేసిన పనితో మెగా ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. అప్పటి నుండి అల్లు అర్జున్, ఆయన ఫ్యాన్స్‌పై మెగా ఫ్యాన్స్ గరంగరం అవుతూనే ఉన్నారు. అల్లు అర్జున్ కూడా తగ్గేదే లే అన్నట్లుగా ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతున్నారు తప్పితే.. ఒక చోట బ్రేక్ వేయాలని మాత్రం చూడటం లేదు. ఇప్పుడాయన నటించిన సెన్సేషనల్ ఫిల్మ్ ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోన్న వేళ.. మేకర్స్ నిర్వహిస్తోన్న ప్రమోషన్స్ విధానంపై కూడా హాట్ హాట్ కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్ చెలరేగిపోతున్నారు.
విషయంలోకి వస్తే..తను నటించే సినిమాల విషయంలో అల్లు అర్జున్ ప్రమోషన్స్ మిగతా హీరోల కంటే విభిన్నంగా కనిపిస్తుంటాయి. బన్నీ సినిమా నుంచి వెలువడే రెగ్యులర్ అప్డేట్స్‌తో పాటు, అభిమానులతో అతను నడుచుకునే తీరు హైలైట్ గా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు విడుదలవుతూ ఉంటాయి. గతంలో ‘పుష్ప’ సినిమా రిలీజ్‌కు ముందు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఓ అభిమాని కాలినడకన 200 కి.మీ. నడిచినట్లు ఓ వార్త వచ్చింది. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పి. నాగేశ్వరరావు అనే యువకుడు అల్లు అర్జున్‌ను కలవాలని మాచర్ల నుంచి హైదరాబాద్‌కు కాలినడకన అల్లు అర్జున్ ప్లకార్డులతో వచ్చి కనిపించాడు. అప్పుడు బన్నీ అతన్ని కలిసిన వీడియో విడుదల చేశారు.మళ్లీ ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా విడుదలకు ముందు.. యుపీ నుంచి ఓ అభిమాని సైకిల్ మీద దాదాపు 1600 కిమీ వచ్చినట్లు.. బన్నీ అతన్ని కలిసినట్లు మరో వీడియో రిలీజ్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై దాదాపు 1600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్ చాట్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో అల్లు అర్జున్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూడొచ్చు. అయితే అభిమాన హీరోలను కలవాలని అందరికీ ఉంటుంది కానీ.. సరిగ్గా సినిమాల విడుదల సమయంలోనే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం నడుస్తూ.. సైకిల్ తొక్కుతూ వచ్చి మొత్తానికి తమ హీరోనూ కలవడంపై మెగా ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో కానీ మొత్తానికి అల్లు అర్జున్ నుంచే ఈ తరహా కంటెంట్ వస్తూ ఉంటుందనేలా సోషల్ మీడియాలో కొందరు యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Latest News