by Suryaa Desk | Wed, Dec 25, 2024, 02:42 PM
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో 'మా' సభ్యులకు ఆయన కీలక సూచనలు చేశారు.సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదని తెలిపారు.''మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, మంచి సంబంధాలు కలిగిఉంటారు. సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచేది మన చిత్ర పరిశ్రమ. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనది. నాడు మొదలుకొని, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులంతా సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం, వివాదాస్పద అంశాలపై ఒకవైపు మాట్లాడటం మానుకోవాలి. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి. వాటిపై చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులు సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేకూరుస్తోంది. ఇలాంటి సమయంలో మనకి సహనం, సానుభూతి, ఐక్యత అవసరం.క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ పెద్ద కుటుంబం అన్న సంగతి గుర్తుంచుకొందాం. ఏ సమస్య వచ్చినా మనమంతా కలిసికట్టుగా ఎదుర్కొందామని తెలియజేస్తున్నా'' అని మంచు విష్ణు పేర్కొన్నారు.
Latest News