|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 04:53 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, పలువురు పార్టీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాస్ నాయుడును పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిందని, ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు.ఎమ్మెల్యే, మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి ఏదైనా ప్రజలు పెట్టిన భిక్ష అని ఆయన అన్నారు. అలాంటి ప్రజలను 'మీరు ఓటు వేయకుంటే ఏమీ ఇవ్వం' అని బెదిరించడమేమిటని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎన్టీఆర్, ఇందిరా గాంధీలను కూడా ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. అలాంటిది ప్రజలకు మూడడుగుల రేవంత్ రెడ్డి ఎంత అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనకు తాను చక్రవర్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు.