|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 09:05 PM
తెలంగాణలో రెండో విడత పంచాయతీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఇక చివరి విడత ఈనెల 17వ తేదీన జరగనుంది. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా మద్యం, డబ్బు సరఫరా జరుగుతోంది. ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. ఇంటింటికీ వెళ్లి డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు.. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు ముందు రోజు.. భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ సర్పంచ్ అభ్యర్థి.. ఏకంగా రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓటుకు రూ.40 వేల చొప్పున పంచినట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్‌చెరు మండలానికి చెందిన ఓ గ్రామంలో.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి.. గెలిచేందుకు రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. ఆ అభ్యర్థి.. గ్రామంలోని ఓటర్లందరికీ.. మూడు విడతల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మూడు సార్లు కలిపి.. ఒక్కో ఓటరుకు రూ.40 వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం.
డబ్బు మాత్రమే కాకుండా వెండి, బంగారం, మద్యం కూడా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కొందరు మహిళ ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్న చిన్న బంగారు నగలను కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ గ్రామంలో మొత్తం 780 ఇళ్లు ఉండగా.. అక్కడి ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం మద్యం కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో.. కేవలం భోజనాల ఖర్చే రూ. కోటి దాటినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ ధన ప్రవాహం జోరుగా సాగినట్లు తెలుస్తోంది. పలు మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల్లో తక్కువలో తక్కువగా ఒక్కో ఓటుకు.. రూ.3 వేల నుంచి అత్యధికంగా.. రూ.15 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.