|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:38 PM
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి హరీశ్ రావు మీద కోపంతోనే తాను కాంగ్రెస్‌లో చేరానంటూ కవిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, తాను పార్టీ మారడానికి గల కారణాలను వివరించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకే తాను, తన భార్య నిర్మల కాంగ్రెస్ పార్టీలో చేరామని జగ్గారెడ్డి తెలిపారు. "అప్పట్లో సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో నా దూకుడు చూసి, నా రాజకీయం నచ్చిన వైఎస్సార్.. మిత్రుడు జెట్టి కుసుమ్‌కుమార్ ద్వారా కబురు పంపారు. కాంగ్రెస్‌లోకి వస్తే సంగారెడ్డికి ఐఐటీ, పటాన్‌చెరు-సంగారెడ్డికి నాలుగు లేన్ల హైవే ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీతోనే నేను పార్టీ మారాను. అంతే తప్ప, హరీశ్ రావుపై కోపంతో కాదు" అని ఆయన వివరించారు.ఆ సమయంలో కవితకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె లీడర్ అయ్యారని, తాను మాత్రం స్వయంగా ఎదిగానని అన్నారు. "మీ ఇంటి పంచాయతీలో నన్ను ఎందుకు ఇరికిస్తారు?" అని కవితను ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు, హరీశ్ రావుకు మధ్య రాజకీయ పోరాటం ఎప్పుడూ ఉంటుందని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు.