|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 09:07 PM
డిసెంబరు 31, జనవరి 1 న్యూ ఇయర్ జోష్ మామూలుగా ఉండదు. యూత్ ఇప్పట్నుంచే వేడుకలు పక్కా ప్రణాళికలు రచిస్తుంటారు. ముక్క, చుక్కతో పాటు చిందులు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అయితే వేడుకల నిర్వహణకు సంబంధించి నగర పోలీసులు కఠిన నిబంధనలను ప్రకటించారు. వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌ల నిర్వాహకులు 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిబంధనల ప్రకారం ఏర్పాట్లు ఉండాలని సీపీ స్పష్టం చేశారు.
నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు:
కార్యక్రమం జరిగే ప్రాంతంలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించకూడదు.
బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజే సిస్టమ్‌లను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలి.
ఇండోర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుంది, అది కూడా 45 డెసిబుల్ పరిమితికి లోబడి మాత్రమే సౌండ్ ఉపయోగించాలి.
అతిథుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.
బాణసంచాకు అనుమతి లేదు. వేడుకలకు వచ్చేవారి కోసం తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి.
పబ్‌లు, బార్లలో మైనర్లను అనుమతించకూడదు. మత్తుపదార్థాలు (డ్రగ్స్) విక్రయించినా, వాడినా నిర్వాహకులు, వినియోగదారులపై కఠిన కేసులు నమోదు చేస్తారు.
ప్రాంతం సామర్థ్యానికి మించి పాస్‌లు/టికెట్లు/కూపన్లు విక్రయించకూడదు.
వేడుకలు పూర్తయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పబ్, బార్ల నిర్వాహకులు కస్టమర్స్‌ను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు క్యాబ్స్, డ్రైవర్లను ఏర్పాటు చేయాలి.
మైనర్లు బండి నడుపుతూ పట్టుబడినా, ప్రమాదానికి గురైనా వాహన యజమానిదే బాధ్యత అవుతుంది.
డ్రంకన్‌డ్రైవ్‌లో (మద్యం తాగి వాహనం నడపడం) పట్టుబడితే వెంటనే కేసు నమోదు చేసి, వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. న్యాయస్థానం రూ.10వేల జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధించవచ్చు. అలాగే, డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలలు లేదా పూర్తిగా సస్పెండ్ చేయవచ్చు.
ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ తొలగించి శబ్ధకాలుష్యానికి కారకులు కావడం నిషేధం.
మహిళల భద్రత కోసం నగరవ్యాప్తంగా షీటీమ్స్ నిఘా పటిష్టంగా ఉంటుంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.